కంటతడి పెట్టిన కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను తలుచుకుని సీఎం అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగాలకు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Jun 2023 7:00 PM ISTకంటతడి పెట్టిన కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను తలుచుకుని సీఎం అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగాలకు లోనయ్యారు. ఢిల్లీ శివారు ప్రాంతం బవానాలోని దిరియాపూర్ గ్రామంలో స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో ఆయన సిసోడియాను గుర్తు తెచ్చుకుని బాధపడ్డారు. విద్యారంగం అభ్యున్నతి కోసం సిసోడియా ఎంతో కష్టపడ్డారని చెప్పుకొచ్చారు. ఆయన ఆలోచనలను గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. ఢిల్లీలో పాఠశాల విద్యార్థులందరూ నాణ్యమైన విద్యను అభ్యసించాలని సిసోడియా ఆకాంక్షించే వారని, ఢిల్లీ విద్యారంగాన్ని దేశంలోనే ఉన్నతమైనదిగా తీర్చిదిద్దాలని కష్టపడ్డారని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ అక్రమ కేసులతో సిసోడియాను జైలుపాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి పాఠశాలలను నిర్మించి, ఢిల్లీ విద్యావ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపించడం వల్లే సిసోడియాను బీజేపీ జైల్లో వేయించిందని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న మనీష్ సిసోడియా ఇటీవలే బెయిల్ కావాలని కోర్టును ఆశ్రయించగా.. ఆయనకు నిరాశ ఎదురైంది. ఆరు వారాల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు సోమవారం నాడు తోసిపుచ్చింది. అస్వస్థతతో చికిత్స పొందుతున్న భార్యను కలుసుకునేందుకు ఆయనకు అనుమతి మాత్రం ఇచ్చింది.