జంషెడ్‌పూర్‌లోని శాస్త్రి నగర్‌లో ఆదివారం సాయంత్రం రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది. రాళ్లు రువ్వడం లాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సెక్షన్ 144 కింద కర్ఫ్యూ విధించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మరాదని, రెచ్చగొట్టే మెసేజ్‌లు వస్తే పోలీసులకు సమాచారం అందచేయాలని పోలీసులుకోరుతున్నారు.
ఒక వర్గానికి చెందిన మతపరమైన జెండాను అపవిత్రం చేశారనే కారణంగా శాస్త్రినగర్ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పాటు ఆస్తుల విధ్వంసానికి దిగారు. దీంతో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. హింసాత్మక ఘటనల్లో ప్రమేయమున్నట్టు భావిస్తున్న 50 మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లు జరిగిన ప్రాంతంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు భారీగా పోలీసు బలగాలను, డ్రోన్లతో నిఘా టీమ్‌లను రంగంలోకి దింపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు చెబుతున్నారు.