మే 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ ఆధారిత టోల్ విధానాన్ని అమలు చేయబోతున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 2025 మే 1 నుండి దేశవ్యాప్తంగా ఉపగ్రహ ఆధారిత టోలింగ్ అమలుకు సంబంధించి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ లేదా భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. దీనిపై క్లారిటీ ఇస్తూ ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది. ప్రెస్ నోట్ ప్రకారం.. టోల్ ప్లాజాల వద్ద ఫీజుల వసూలుకు వాహనాలను ఆపే అవసరం లేకుండా ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ విధానాన్ని మొదట ఎంపిక చేసిన టోల్‌ప్లాజాల వద్ద సెట్ చేస్తారు.
దీని ద్వారా ఏఎన్‌పీఆర్‌తో ఫాస్టాగ్ సేవలు అందిస్తారు. టోల్‌ప్లాజాల వద్ద ఏఎన్‌పీఆర్ కెమెరాలు వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించి.. వాహనాలు ఆగకుండానే ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా టోల్ వసూలు చేస్తాయి. నిబంధనలు పాటించకపోతే, ఉల్లంఘించిన వారికి ఈ-నోటీసులు అందజేయబడతాయి, వీటిని చెల్లించకపోతే FASTag రద్దు, ఇతర వాహన సంబంధిత జరిమానాలు అందుతాయి. ఎంపిక చేసిన టోల్ ప్లాజాలలో 'ANPR-FASTag-ఆధారిత బారియర్-లెస్ టోలింగ్ సిస్టమ్' అమలు కోసం NHAI బిడ్లను ఆహ్వానించింది . ఈ వ్యవస్థ పనితీరు, సామర్థ్యం మరియు వినియోగదారుల ప్రతిస్పందన ఆధారంగా, దేశవ్యాప్తంగా దీని అమలుకు సంబంధించి నిర్ణయం తీసుకోబడుతుంది.