తమిళనాడులోని తెన్‌కాసి జిల్లా అటవీ ప్రాంతంలో శనివారం అడవి ఎలుగుబంటి దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
కారుతిలింగపురానికి చెందిన వైగుండామణి ద్విచక్రవాహనంపై మసాలా ప్యాకెట్లను విక్రయించేందుకు శివశైలం నుంచి పెతంపిళ్లైకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అతను అడవిని దాటుతుండగా ఒక ఎలుగుబంటి పొదల్లో నుండి దూకి అతనిపై దాడి చేసింది. బల్లూకం వైగుండమణిని నేలపైకి నెట్టి తీవ్రంగా కొరికింది.
గమనించిన కొంత మంది ఎలుగుబంటిని తరిమికొట్టేందుకు రాళ్లు విసిరారు. దీంతో ఆగ్రహంతో ఎలుగుబంటి వారిపై కూడా దాడి చేసింది. ఈదాడిలో నాగేంద్రన్, శైలేంద్ర లు గాయపడ్డారు. క్రమంగా జనాలు గుమిగూడడంతో బల్లూకం అక్కడి నుంచి అడవిలోకి పరుగులు తీసింది. అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అటవీ అధికారులు ఎలుగుబంటిని ట్రాక్ చేసి సమీపంలోని ఓ ప్రాంతంలో పట్టుకున్నారు. కాగా.. ఎలుగుబంటి దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.