దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా తగ్గుముఖం పట్టనే లేదు. అంతలోనే కొత్త కొత్త వైరస్‌లు భయపెడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ విజృంభిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కోళ్లు, బాతులు చనిపోయాయి. దీంతో బర్డ్ ప్లూ ఎక్కువగా ఉన్న చోట అధికారులు 15 రోజుల పాటు చికెన్, కోడి గుడ్ల అమ్మకాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కేవలం బర్డ్ ప్లూ అధికంగా ఉన్న ప్రాంతాల్లో చికెన్, కోడిగుడ్లు తినొద్దని చెబుతున్నప్పటికి.. మిగిలిన ప్రాంతాల్లోని ప్రజలకు కూడా భయం పట్టుకుంది. ఎందుకన్నా మంచిదని కొన్ని రోజుల పాటు చికెన్‌కు దూరంగా ఉండాలని అనుకుంటున్నారట.
దీని ప్రభావం పౌల్ట్రీ రంగంపై పడింది. చికెన్ కానీ, గుడ్లు కాని తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నా.. హర్యానా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. జింద్ జిల్లాలో ప్రతిరోజు కోళ్ల విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. దేశ రాజధాని ఢిల్లీకి ప్రతి రోజు 4 లక్షల కోళ్లు విక్రయించేందుకు వెళుతుంటాయని అంచనా. బర్డ్ ఫ్లూ కారణంగా..సేల్స్ పడిపోవడంతో కోళ్ల వ్యాపారులకు ప్రతి రోజు సుమారు కోటి నుంచి 20 లక్షల రూపాయల వరకు నష్టపోతున్నారు. ఢిల్లీ మార్కెట్ లో బ్రాయిలర్ కోడి కిలో రూ.15 కు పడిపోయింది. చికెన్ ను బాగా ఉడికించి తినడం వల్ల నష్టమేమీ ఉండబోదని వైద్యులు అంటున్నారు.