ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 8 మంది నక్సలైట్లు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.
By Srikanth Gundamalla Published on 15 Jun 2024 3:22 PM ISTఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 8 మంది నక్సలైట్లు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. శనివారం ఉదయం నుంచి భద్రగా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. భీకరమైన కాల్పుల తర్వాత 8 మంది మావోయిస్టులు చనిపోగా.. ఒక జవాను మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా.. ఈ ఎదురుకాల్పులు అబుజ్‌మాడ్ అడవుల్లో చోటుచేసుకున్నాయి.
నారాయణపూర్, కంకేర్, దంతేవాడ, కొండగావ్ జిల్లాలకు చెందిన భద్రతా బలగాలు యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సమయంలోనే ఎదురు కాల్పులు జరిగినట్లు రాయ్‌పూర్ సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ఇంకా అక్కడ మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, 53 బెటాలియన్ ఐటీబీపీకి చెందిన దళాలు 12వ తేదీ నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు. కాగా.. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
ఈ నెలలోనే ఇది రెండో యాంటీ నక్సల్ ఆపరేషన్. జూన్ 7వ తేదీన మొదటి ఆపరేషన్ జరిగింది. ఆ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సలైట్లు చనిపోయారు. గతవారం కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అమిత్‌షా.. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పాటు అయిన తర్వాత మావోయిస్టుల సమస్యను పరిష్కరిస్తామన్నారు. మూడేళ్లలో భారత్‌ను నక్సలిజం ముప్పు నుంచి కాపాడుతామని చెప్పారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన కామెంట్స్‌ను నిజం చేస్తున్నాయి.