ఆ 10 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు.. ఎందుకంటే..?
Centre To Send Teams To 10 States With High Covid Cases.కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను వణికిస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 25 Dec 2021 8:55 AM GMTకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇక మన దేశంలో కూడా ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో అవసరం అయితే రాత్రి కర్ఫ్యూలు, ఆంక్షలు అమలు చేయాలని ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. కాగా.. 17 రాష్ట్రాలకు ఈ వేరియంట్ పాకింది. 415 కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపాలని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం నిర్ణయించింది.
కరోనా కేసులు పెరగడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్న రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ గుర్తించింది. దీంతో ఆయా రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఉన్నతస్థాయి బృందాలు వెల్లనున్నాయి. ఈ బృందాలు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మిజోరాం, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్‌ల్లో మూడు నుంచి ఐదు రోజుల పాటు పర్యటించనున్నాయి. కరోనా పరీక్షలు, కరోనా నిబంధనలు అమలు వంటి అంశాలపై ఆయా రాష్ట్ర అధికారులతో ఈ బృందాలు కలిసి పనిచేయనున్నాయి. అదే విధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. అలాగే ఆస్పత్రుల్లో ఉన్న మౌళిక సదుపాయాలు, సమస్యలు వంటివి పరిశీలించి ఆ నివేదికను కేంద్రానికి అందించనున్నారు.
ఇక దేశంలో శనివారం ఉదయం నాటికి ఒమిక్రాన్ కేసుల సంఖ్య 415కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 108 కేసులు నమోదు కాగా.. ఆ తరువాత ఢిల్లీలో 79, గుజరాత్‌లో 43,తెలంగాణలో 38, కేరళలో 37, తమిళనాడులో 34, కర్ణాటకలో 31, రాజస్థాన్‌లో 22, హర్యానాలో 4, ఒడిశాలో 4, ఆంధ్రప్రదేశ్‌లో 4, జమ్ము కశ్మీర్‌లో 3, పశ్చిమ బెంగాల్ 3, ఉత్తరప్రదేశ్‌లో 2, చండీఘర్‌లో 1, లద్దాఖ్‌లో 1, ఉత్తరాఖండ్‌లో 1 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసుల్లో ఇప్పటి వరకు 115 మంది కోలుకున్నారు.