ఓటర్‌కార్డ్‌తో ఆధార్‌ను లింక్ చేయడంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ ఐడీకి ఆధార్ లింక్ చేసే సమయాన్ని మరోసారి పొడిగించింది. 1 ఏప్రిల్ 2023తో ఈ గడువు ముగియనుండగా దాన్ని 31 మార్చి 2024 వరకు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
గతేడాది జూన్ 17న న్యాయ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 1 ఏప్రిల్ 2023 లోపు ఓటర్ఐడీకి ఆధార్ లింక్ చేయాల్సి ఉంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఓటర్లు ఫామ్-6బీ ను సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టు నుంచి ఎన్నికల కమిషన్ రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి ఆధార్ నంబర్లు సేకరించడం మొదలుపెట్టింది. ఓటర్ ఐడీకి ఆధార్‌ని లింక్ చేసే గడువు సమీపిస్తుండడంతో కేంద్రం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఓటర్ ఐడీకి ఆధార్ సంఖ్యను లింక్ చేయడం ద్వారా బోగస్ ఓట్లను గుర్తించవచ్చు. దీంతో ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓటర్ కార్డులు ఉంటే అన్ని రద్దు అవుతాయి. దీని వల్ల పారదర్శకత వస్తుంది.