కరోనా మహమ్మారి ప్రస్తుతానికి మన దేశంలో అదుపులోనే ఉంది. నిత్యం 10వేల లోపు కేసులు నమోదు అవుతున్నాయి. అయితే..తాజాగా దక్షిణాఫ్రికా, బోట్సవానా, హాంకాంగ్‌లో కొత్తరకం వేరియంట్‌ను గుర్తించారు. దీనికి బి.1.1.529గా నామకరణం చేశారు. ఈ కొత్త రకానికి సంబంధించి 22 కేసులు వెలుగుచూసినట్లు దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా స్క్రీనింగ్, కొవిడ్ పరీక్షలు పకడ్బందీగా చేయాలని ఆదేశించింది.
దక్షిణాఫ్రికా, హాంగ్‌కాంగ్ నుంచి వచ్చేవారిపట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా వీసా నిబంధనలు, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు సడలించడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అదనపు చీఫ్ సెక్రటరీలు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులకు ఈ మేరకు లేఖలు రాశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయితే.. వెంటనే వారి శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లకు పంపాలన్నారు.