ఒమిక్రాన్ టెన్ష‌న్‌.. రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క ఆదేశాలు

Centre asks states to activate war rooms.క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌పంచ‌దేశాల‌ను వణికిస్తోంది. డెల్టా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Dec 2021 8:18 AM IST
ఒమిక్రాన్ టెన్ష‌న్‌.. రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క ఆదేశాలు

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌పంచ‌దేశాల‌ను వణికిస్తోంది. డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతోంది. ఇక మ‌న‌దేశంలోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర‌ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. రాష్ట్రాలకు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్‌తో అప్రమత్తంగా ఉండాలని సూచించ‌డంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప‌లు సూచ‌న‌లు చేస్తూ కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రాజేశ్ భూష‌ణ్ లేఖ రాశారు.

ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న సంఖ్యను బట్టి స్ధానిక పరిస్ధితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. దూరదృష్టితో వ్యవహరించి రాష్ట్రాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పింది. అవసరమైతే ఒమిక్రాన్ కేసులు ఎక్కువున్న ప్రాంతాల్లో కఠినమైన కంటైన్మెంట్ చర్యలు అమలు చేయాలని తెలిపింది. రాత్రి క‌ర్ఫ్యూలు విధించ‌డం, భారీ జ‌న‌స‌మూహాల‌ను నియంత్రించ‌డం, కార్యాల‌యాల్లో సిబ్బంది సంఖ్య‌ను త‌గ్గించ‌డం, ప్ర‌జా ర‌వాణాపై ఆంక్ష‌లు వంటి చ‌ర్య‌ల‌ను లేఖ‌లో పేర్కొన్నారు.

అదే స‌మ‌యంలో ఆస్ప‌త్రుల్లో బెడ్స్‌, అంబులెన్సులు, ఆక్సిజ‌న్ ప‌రిక‌రాలు, జౌష‌దాలు వంటి వైద్య సంబంధ‌మైన సౌక‌ర్యాల మెరుగుద‌ల‌కు అత్య‌వ‌స‌ర నిధులు వినియోగించుకోవాల‌ని సూచించారు. వందశాతం వ్యాక్సినేష‌న్ ను పూర్తి చేయాల‌న్నారు. డోర్‌ టు డోర్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అర్హులైనవారందికీ ఫస్ట్‌, సెకండ్‌ డోస్‌ టీకా వేగంగా వేయాలని సూచించింది. ఇక వైరస్‌ బాధితుల హోం ఐసోలేషన్‌ సమయంలో నిబంధనలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది.

ఇక దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 12 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు న‌మోదు కాగా.. వాటి సంఖ్య 215కి చేరింది. అత్య‌ధికంగా కేసులు న‌మోదైన తొలి మూడు రాష్ట్రాల జాబితాలో మ‌హారాష్ట్ర‌(65), ఢిల్లీ(54), తెలంగాణ‌(24) ఉన్నాయి. ఆ త‌రువాత క‌ర్ణాట‌లో 19, రాజ‌స్థాన్‌లో 18, కేర‌ళ‌లో 15, గుజ‌రాత్‌లో 14 కేసులు వెలుగుచూడ‌గా.. బాధితుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 77 మంది కోలుకున్నారు.

Next Story