2029 తర్వాత కూడా మా ప్రచార నాయకుడు మోదీనే: అమిత్‌షా
కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రానుందనీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు.
By Srikanth Gundamalla Published on 13 May 2024 10:25 AM IST2029 తర్వాత కూడా మా ప్రచార నాయకుడు మోదీనే: అమిత్‌షా
కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రానుందనీ.. అలాగే ప్రధానిగా మోదీ మరోసారి ప్రమాణస్వీకారం చేస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు. అంతేకాదు.. 2029 తర్వాత కూడా ప్రధాని మోదీనే తమ నాయకుడిగా కొనసాగుతారని చెప్పారు. ప్రధాని మోదీ పాలన పట్ల దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అందుకే మోదీని మరోసారి ఎన్నుకోనున్నారని తెలిపారు. ఇక ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథి స్థానానికి బదులు రాయ్‌బరేలిలో పోటీ చేస్తున్న రాహుల్‌గాంధీ ఓడిపోవడం ఖాయమని అమిత్‌షా విమర్శించారు.
2025 తర్వాత మోదీ దేశానికి ప్రధాని కాలేరని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌పై తాజాగా అమిత్‌షా స్పందించారు. కేజ్రీవాల్‌కు కౌంటర్ ఇచ్చారు. కేజ్రీవాల్ తన పార్టీని సరిగ్గా నడపలేకపోతున్నారని విమర్శించారు. జైల్లో ఉన్న సమయంలో ఢిల్లీకి సీఎంగా ఎవరిని నియమించాలో తెలియకనే తను రాజీనామా చేయలేదన్నారు. జైల్లో ఉండి ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేశారని ఫైర్ అయ్యారు. 2029 తర్వాత కూడా బీజేపీ ఎన్నికల ప్రచారానికి మోదీనే నాయకుడు అనీ.. ఆయన నాయకత్వంలోనే పార్టీ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు.
రాహుల్‌గాంధీ అమ్మమ్మ గరీబీ హఠావో నినాదం ఇచ్చారనీ.. కానీ పేదరికం మాత్రం పోలేదని అమిత్‌షా అన్నారు. అలాగే రాహుల్ గాంధీ హామీలు కూడా అలాగే అవుతాయని అన్నారు. ఆయన గతంలోనే ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. రాహుల్ మాటలను.. హామీలను దేశంలో ఉన్న ప్రజలెవ్వరూ నమ్మడం లేదని హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. అభివృద్ధి గురించి కాంగ్రెస్ తమకు చెప్పకూడదని మండిపడ్డారు. తాము ఈ పదేళ్ల కాలంలో దేశాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లామన్నారు. యూపీఏ పాలనతో పోలిస్తే ఎన్డీఏ హయాంలో అభివృద్ధి పనులు మరింత ఎక్కువగా జరిగాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు.