విమాన ప్రయాణికులకు షాక్.. డొమెస్టిక్ ఎయిర్ ఫేర్ క్యాప్స్ ఎత్తివేసిన కేంద్రం

దేశీయ విమాన టికెట్ల ధరలపై విధించిన గరిష్ట పరిమితులను (Fare Caps) ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

By -  అంజి
Published on : 22 March 2026 7:34 AM IST

Domestic Airfare Caps, Ministry of Civil Aviation, DGCA, IndiGo Crisis, Flight Ticket Prices, Aviation Sector Reforms, Airfare Monitoring, Travel News 2026

విమాన ప్రయాణికులకు షాక్.. డొమెస్టిక్ ఎయిర్ ఫేర్ క్యాప్స్ ఎత్తివేసిన కేంద్రం

దేశీయ విమాన టికెట్ల ధరలపై విధించిన గరిష్ట పరిమితులను (Fare Caps) ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత ఏడాది ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో తలెత్తిన పైలట్ల రోస్టరింగ్ సంక్షోభం కారణంగా వేలాది విమానాలు రద్దయ్యాయి. ఆ సమయంలో విమాన సంస్థలు ప్రయాణికుల నుంచి ఇష్టానుసారంగా అధిక ధరలు వసూలు చేయకుండా అడ్డుకోవడానికి 2025, డిసెంబర్ 6న ప్రభుత్వం ఈ ధరల పరిమితులను అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం విమాన సర్వీసులు మునుపటిలా సాధారణ స్థితికి రావడంతో, మార్చి 23, 2026 నుండి ఈ పరిమితులను ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

గతంలో విధించిన నిబంధనల ప్రకారం.. 500 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి గరిష్ట ధర రూ. 7,500 గా ఉండేది. ఢిల్లీ-ముంబై వంటి 1,000 నుండి 1,500 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాల్లో రూ. 15,000, అలాగే 1,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న ప్రయాణాలకు రూ. 18,000 పరిమితి ఉండేది. ఇప్పుడు ఈ ధరల పరిమితులు తొలగిపోవడంతో, విమాన సంస్థలు మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ధరలను నిర్ణయించుకునే వెసులుబాటు కలిగింది.

ధరల పరిమితులను ఎత్తివేసినప్పటికీ, విమానయాన సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ధరలు పారదర్శకంగా, హేతుబద్ధంగా ఉండాలని, ప్రయాణికులకు భారం కాకూడదని సూచించింది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో టికెట్ ధరలను విపరీతంగా పెంచితే సహించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. విమాన ధరల పోకడలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిరంతరం పర్యవేక్షిస్తుందని వెల్లడించింది.

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే మళ్లీ ధరల నియంత్రణ చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. విమానయాన రంగంలో పోటీని ప్రోత్సహిస్తూనే, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని ప్రభుత్వం వివరించింది.

Next Story