ఫాస్టాగ్‌లు ఇక ఉండవు.. టోల్ కలెక్షన్లకు కొత్త విధానం
టోల్‌ప్లాజాల వద్ద చార్జీలను వాహనదారుల నుంచి వసూలు చేస్తారు ఇది అందరికీ తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 10 Feb 2024 4:46 PM ISTఫాస్టాగ్‌లు ఇక ఉండవు.. టోల్ కలెక్షన్లకు కొత్త విధానం
టోల్‌ప్లాజాల వద్ద చార్జీలను వాహనదారుల నుంచి వసూలు చేస్తారు ఇది అందరికీ తెలిసిందే. అయితే.. మొదట మాన్యువల్‌గా డబ్బులు తీసుకుని ఆ తర్వాత టోల్‌గేట్ నుంచి అనుమతి ఇచ్చేవారు. రానురాను ఇలా మాన్యువల్‌గా వసూళ్లు చేయడం ద్వారా ట్రాఫిక్ ఏర్పడుతుందనీ.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఫాస్టాగ్‌ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2016లో ఈ విధానం ప్రారంభం అయ్యింది. దీని ద్వారా ఆటోమెటిగ్‌గా టోల్ వసూలు చేసేలా వీలు కలిగింది. అయితే.. ఇప్పుడు ఫాస్టాగ్‌ల కంటే వేగంగా టోల్ కలెక్ట్ చేసే కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ పద్ధతిని అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది.
కాగా.. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ ద్వారా టోల్‌గేట్ చెల్లింపులు జరపాలంటే వాహనదారులు వాటిని రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ అందులో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. దాంతో.. పలుమార్లు సరిపడా అమౌంట్ లేనందువల్ల ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్‌ల నుంచి జీపీఎస్ ఆధారిత సిస్టమ్‌కు మారాలని కేంద్రం ఆలోచన చేస్తోంది. దీనివల్ల రహదారులపై ప్రయాణం మరింత వేగవంతంగా.. సాఫీగా మారనుంది. అయితే.. ఇప్పటికే ఈ జీపీఎస్ ద్వారా టోల్‌గేట్ వసూళ్ల విధానాన్ని ముంబైలోని అటల్ సేతు వంటి రహదారులపై పరీక్షిస్తున్నారు. ఈ సిస్టమ్ కదిలే వాహనదాల నెంబర్ ప్లేట్‌ను ప్రత్యేక కెమెరాలతో స్కాన్ చేస్తుంది. ఆ కెమెరాలు ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఈ సిస్టమ్‌లో వెహికల్ రిజిస్ట్రేషన్‌కు లింక్ అయిన బ్యాంకు అకౌంట్ నుంచి టోల్‌గేట్‌కు కట్టాల్సిన డబ్బులు కట్ అవుతాయి.
ఇక ఈ జీపీఎస్ విధానం అమల్లోకి వస్తే టోల్‌గేట్ల వద్ద వాహనాలను ఆపాల్సిన అవసరం ఉండదు. తద్వారా టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ అస్సలు ఉండదు. అలాగే ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్‌ను దేశవ్యాప్తంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. పైలట్ ప్రాజెక్టుల విజయం.. ఇతర అంశాలను పరిశీలించిన తర్వాత ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.