రాష్ట్రాల్లో శాంతి భద్రతల నివేదికలపై కేంద్రం కీలక ఆదేశాలు

కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో ఇటీవల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం జరిగింది.

By Srikanth Gundamalla  Published on  18 Aug 2024 5:02 AM GMT
Central govt, peace and security, report,  every two hours,

రాష్ట్రాల్లో శాంతి భద్రతల నివేదికలపై కేంద్రం కీలక ఆదేశాలు 

కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో ఇటీవల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం జరిగింది. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పలు చోట్ల విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. వైద్య సేవలను నిలిపివేస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు. వైద్యుల రక్షణ కోసం స్పష్టమైన నిబంధనలను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. రాష్ట్రాల్లో శాంతిభద్రతలపై నివేదికలపై కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

అన్ని రాష్ట్రాలలోని పోలీసు ఉన్నతాధికారులు ప్రతి రెండు గంటలకు మెయిల్, ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపాలని హోంశాఖ ఆదేశించింది. పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చే నివేదికల ఆధారంగానే పరిస్థితులను అంచనా వేసి.. దానికి తగినట్లుగా చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ పేర్కొంది. కాగా.. ఆర్జీకర్‌ ఆస్పత్రిలో సంబంధిత అధికారుల నుంచి సమాచారం, మద్దతు లేకపోవడం, పోలీసులు నిందితుడికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దాంతో.. ఈ కేసును కోర్టు సీబీఐకి అప్పగించినట్లు పేర్కొంది.

ఆర్జీకర్‌ ఆస్పత్రిలో వైద్యురాలిపై అత్యాచార సంఘటన తర్వాత దేశంలో ఉన్న అన్ని వైద్య కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. జాతీయ స్థాయిలో డాక్టర్లు, వైద్య విద్యార్థులు, కళాశాల, ఆస్పత్రి పరిసరాల్లో భద్రతకు తగిన విధానాన్ని రూపొందించాలని సూచించింది. వైద్యులు ఆస్పత్రి ఆవరణలో తిరుగుతున్న సమయంలో భద్రత ఉండేలా రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయాలని పేర్కొంది.

Next Story