ఉజ్వల పథకం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌పై ఇచ్చే రాయితీ పెంపు
ఉజ్వల పథకం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌పై ఇచ్చే రాయితీ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 4 Oct 2023 10:51 AM GMTఉజ్వల పథకం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌పై ఇచ్చే రాయితీ పెంపు
త్వరలోనే దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉజ్జ్వల గ్యాస్ సిలిండర్ పై మరో రూ.100 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో, ఆ గ్యాస్ సిలిండర్ రాయితీ రూ.300కు పెరిగినట్లయింది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
తెలంగాణలో పసుపుబోర్డు, ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్విద్యాలయం ఏర్పాటుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. ఆదీవాసీ దేవతల పేరు పెడుతున్నామని తెలిపారు. ఈ వర్సిటీకి రూ.900 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తూ తీర్మానానికి ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. అయితే.. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య వాటాను తేల్చాలని కృష్ణా ట్రైబ్యునల్‌కు ఆదేశించినట్లు వెల్లడించారు. కొత్త నిబంధనలు రూపొందించి తమ వాటాను తేల్చాలని తెలంగాణ కోరుతుందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జలాల పంపిణీ చేయాలన్నారు. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతుందన్నారు అనురాగ్ ఠాకూర్.
ఉజ్వల పథకం కింద పేదలకు సరఫరా చేసే వంటగ్యాస్ సిలిండర్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రూ.200 చొప్పున రాయితీ ఇస్తోంది. తాజాగా ఈ రాయితీని రూ.300కు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతో.. ఉజ్వల లబ్ధిదారులకు 14.2 కిలోల సిలిండర్ మార్కెట్ ధర రూ.903కు బదులుగా ప్రస్తుతం రూ.703 చెల్లిస్తుండగా.. తాజా నిర్ణయంతో ఇకపై సిలిండర్‌కు రూ.603 చెల్లిస్తే సరిపోతుంది.