లక్షద్వీప్‌లో మౌలిక వసతులపై దృష్టి.. బడ్జెట్‌లోనూ ప్రస్తావన
మాల్దీవులు, భారత్ మధ్య వివాదం రగులుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 1 Feb 2024 10:32 AM GMTలక్షద్వీప్‌లో మౌలిక వసతులపై దృష్టి.. బడ్జెట్‌లోనూ ప్రస్తావన
మాల్దీవులు, భారత్ మధ్య వివాదం రగులుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉన్న లక్షద్వీప్‌లో మౌళిక వసతులను కల్పించేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మేరకు అభివృద్ధిని చేసి పర్యాటక ప్రాంతంగా పేరు తీసుకురావాలని చూస్తోంది. 2024 తాత్కాలిక బడ్జెట్ ప్రసంగంలో కూడా ఈ విషయాన్ని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు చెప్పారు. ప్రభుత్వం పర్యాటక కేంద్రాలను ప్రచారం చేయడానికి వీలుగా.. వడ్డీ రహిత దీర్ఘకాలిక రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే లక్షద్వీప్‌లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం దృష్టి సారిస్తుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
పర్యాటక కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని నిర్మలమ్మ చెప్పారు. భారత్‌లో 60 చోట్ల నిర్వహించిన జీ20 సమావేశాలు ఇక్కడి వైవిధ్యాన్ని ప్రపంచ పర్యాటకులకు తెలిపాయన్నారు. మన ఆర్థఙక శక్తితో దేశౄన్ని వ్యాపారాలకు కేంద్రంగా చేయడం సహా.. కాన్ఫరెన్స్ టూరిజాన్ని కూడా ఆకర్షించాలన్నారు. మధ్య తరగతి ప్రయాణికులు ఇప్పుడు కొత్త ప్రాంతాల అన్వేషణకు ఉత్సాహంగా ఉన్నారనీ చెప్పారు. ఆకర్షణీయమైన ప్రదేశాలను సమగ్రంగా అభివృద్ధి చేసేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. వాటిని ప్రపంచ స్తాయిలో బ్రాండింగ్, మార్కెటింగ్ చేస్తామన్నారు. నాణ్యమైన సేవల ఆధారంగా పర్యాటక కేంద్రాలకు రేటింగ్ ఇచ్చేలా ఫ్రేమ్ వర్క్ సిద్ధం చేస్తామన్నారు. రాష్ట్రాలతో కలిసి దామాషా విధానంలో అభివృద్ధికి అవసరమైన ఫైనాన్సింగ్ సమకూరుస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. దేశీయ పర్యటక రంగాన్ని ప్రోత్సహించేందుకు పోర్టు కనెక్టివిటీ, టూరిజం ఇన్‌ఫ్రా, ఇతర వసతులను మన దీవుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. వీటిల్లో లక్షద్వీప్ కూడా ఉందనీ.. ఇది ఉద్యోగాలను సృష్టిస్తుందనీ నిర్మలా సీతారామన్ చెప్పారు.
ప్రధాని లక్షద్వీప్ పర్యటన సందర్భంగా..పర్యాటకులు ఇక్కడికి రావాలంటూ పిలుపునిచ్చారు. దాంతో.. ఆయన పిలుపుని తప్పుబడుతూ మాల్దీవుల మంత్రులు విషం కక్కారు. అంతే.. దాంతో ఇరు దేశాల మధ్యవివాదం మొదలైంది. కేకంగా బైకాట్ మాల్దీవులు అంటూ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్ నుంచి పర్యాటకులు మాల్దీవులకు వెళ్లేవారు గణనీయంగా తగ్గారు. పర్యాటక వెబ్‌సైట్లు కూడా ఆయా ప్యాకేజ్‌లను నిలిపేశాయి. ఇక లక్షద్వీప్ కోసం కూడా భారత ప్రజలు తెగ వెతికారు. ఆఫర్లు.. ఇతర విషయాలను సెర్చ్ చేశారు. దాంతో.. లక్షద్వీప్‌పై కేంద్రం దృష్టి పెట్టింది. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది వరల్డ్ వైడ్‌గా పేరు తెచ్చేందుకు పూనుకుంది.