ఉల్లి ఎగుమతులపై ఆంక్షలను ఎత్తేసిన కేంద్ర ప్రభుత్వం

ఉల్లి ధరలను అదుపులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  4 May 2024 9:01 AM GMT
central government,  restrictions,  onion exports,

ఉల్లి ఎగుమతులపై ఆంక్షలను ఎత్తేసిన కేంద్ర ప్రభుత్వం

గతంలో దేశవ్యాప్తంగా ఉల్లి ధరలను అదుపులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దాదాపు కొన్ని నెలలు ఈ ఆంక్షలు అమలులో కొనసాగాయి. తాజాగా ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు డైరెక్టరేట్‌ జనరల్ ఆఫ్‌ ఫారిన్ ట్రేడ్‌ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని అందులో పేర్కొంది. ఇక ఆంక్షల ఎత్తివేత తదుపరి ఉత్తర్వుల వరకు కొనసాగుతాయని వెల్లడించారు.

ఉల్లి ఎగుమతులపై ధరను టన్నుకి 550 డాలర్లుగా (రూ.45,860) గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో తదుపరి దశ పోలింగ్‌ జరగనున్న వేల కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులు జరుగుతుంటాయి.

మరోవైపు ఉల్లి ఎగుమతులపై కొన్నాళ్లుగా నిషేధం విధించడంతో మహారాష్ట్రలోని ఉల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నిషేధం వల్ల తమకు ఆశించిన స్థాయిలో రాబడి రావడం లేదని.. ఉల్లి పంట వేసిన వారు ఎగుమతులపై నిషేధం విధించడంతో నష్టపోతున్నామని ఆవేదన చెందారు. అంతేకాదు.. ఈ ఆంక్షలను ఎత్తివేయాలంటూ మహారాష్ట్రలో పలు చోట్ల ఉల్లి రైతులు ఆందోళనలను నిర్వహించారు. మరోవైపు విపక్ష పార్టీ కాంగ్రెస్‌ ఉల్లి రైతులను కేంద్రం పట్టించుకోవడం లేదనీ.. వారికి నష్టం చేసేందుకే ఆంక్షలను విధించారని మండిపడింది. ఇలా రైతులు, రాజకీయ పార్టీల నాయకుల డిమాండ్‌తో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో పలు దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కలిసి వచ్చే అంశమని పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Next Story