కారులో ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోలేదని.. ఆనంద్ మహీంద్రాపై కేసు
కారు భద్రత విషయంలో తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఆనంద్ మహీంద్రాతో పాటు 12 మంది ఉద్యోగులపై మోసం కేసు నమోదైంది.
By అంజి Published on 26 Sep 2023 2:59 AM GMTకారులో ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోలేదని.. ఆనంద్ మహీంద్రాపై కేసు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కారు భద్రత విషయంలో తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఆనంద్ మహీంద్రాతో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌కు చెందిన 12 మంది ఉద్యోగులపై మోసం కేసు నమోదైంది. ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేని స్కార్పియో కారును కంపెనీ తనకు విక్రయించిందని, తన కొడుకు కారు ప్రమాదంలో మరణించాడని ఫిర్యాదుదారు రాజేష్ మిశ్రా ఆరోపించారు. రాజేష్ మిశ్రా తన కుమారుడు అపూర్వ్‌కు బహుమతిగా 2020లో బ్లాక్ స్కార్పియోను రూ. 17.39 లక్షలకు కొనుగోలు చేశారు.
జనవరి 14, 2022న, స్నేహితులతో కలిసి లక్నో నుండి కాన్పూర్‌కు తిరిగి వస్తుండగా, పొగమంచు కారణంగా అపూర్వ కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది, ఫలితంగా అతను అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదం జరిగిన తర్వాత, జనవరి 29న రాజేష్ తాను కారు కొన్న ఆటో స్టోర్ వద్దకు చేరుకుని, కారులోని లోపాలను ఎత్తిచూపారు. ఎఫ్‌ఐఆర్‌లో.. ప్రమాదం సమయంలో సీటుబెల్ట్ బిగించినప్పటికీ, ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోవడంలో విఫలమైందని ఫిర్యాదుదారు తెలిపారు. కంపెనీ తప్పుడు హామీలిచ్చి మోసం చేసిందని రాజేష్ మిశ్రా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఉంటే తన కొడుకు చనిపోయేవాడు కాదని రాజేష్ సంస్థ మోసపూరిత చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. కంపెనీ ఉద్యోగులు రాజేష్‌తో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. డైరెక్టర్ల సూచనల మేరకు నిర్వాహకులు తనను, తన కుటుంబాన్ని దుర్భాషలాడారని, చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. ప్రమాదం తర్వాత, స్కార్పియోను రుమాలోని మహీంద్రా కంపెనీ షోరూమ్‌కు తరలించారు. కంపెనీ వాహనంలో ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేయలేదని రాజేష్ అభిప్రాయపడ్డారు.
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420 (మోసం), 287 (యంత్రాలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం), 304-A (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం), మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.