వీధి కుక్కల దాడి.. చికిత్స పొందుతూ ప్రముఖ వ్యాపారవేత్త మృతి

వీధి కుక్కల దాడి తర్వాత గాయపడ్డ ప్రముఖ వ్యాపారవేత్త పరాగ్ దేశాయ్‌ చికిత్స పొందుతూ కన్నుమూశారు.

By Srikanth Gundamalla  Published on  23 Oct 2023 8:56 AM GMT
business man, died,   street dogs, attack,

వీధి కుక్కల దాడి.. చికిత్స పొందుతూ ప్రముఖ వ్యాపారవేత్త మృతి

కొంతకాలంగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నపిల్లలు ఒంటరిగా కనబడితే చాలు.. దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కొన్ని సంఘటనల్లో అయితే ప్రాణాలు కూడా కోల్పోయారు. చిన్నారులపైనే కాదు పెద్దవారిపైనా వీధికుక్కలు దాడి చేస్తున్నాయి. అయితే.. ఇటీవల ఓ వ్యాపారవేత్తపైనా వీధికుక్కలు దాడి చేశాయి. దాంతో.. అతను కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయం అయ్యింది. ఆ తర్వాత చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

ప్రముఖ వ్యాపారవేత్త, వాఘ్‌ బక్రీ టీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్‌ దేశాయ్‌ కన్నుమూశారు. మెదడులో రక్తస్రావం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు కంపెనీ ప్రకటన చేసింది. గతవారం పరాగ్ దేశాయ్‌ అహ్మ‌దాబాద్‌లోని తన ఇంటి దగ్గర నడుస్తూ వెళ్తున్నారు. అదే సమయంలో వీధికక్కులు ఆయనపై దాడి చేశాయి. దాంతో.. తప్పించుకునే క్రమంలో ఆయన కిందపడిపోయారు. తలకు తీవ్ర గాయం అయ్యింది. ఇక ఈ సంఘటన నుంచి తెలుసుకున్న భద్రతా సిబ్బంది, కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న ఉన్న పరాగ్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు అనుక్షణం పరిశీలిస్తూనే ఉన్నారు. కానీ.. ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. మెదడులో రక్తస్రావం వల్లే పరాగ్ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు కూడా వెల్లడించారు.

పరాగ్‌ దేశాయ్‌ మృతిపట్ల పలువురు రాజకీయ నేతలతో పాటు వ్యాపార వేత్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరకుంటున్నారు. కాగా.. వాఘ్‌ బక్రీ టీ గ్రూప్‌ ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లలో పరాగ్‌ దేశాయ్‌ ఒకరు. కంపెనీని ఈ-కామర్స్‌లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. కంపెనీ సేల్స్‌, మార్కెటింగ్‌, ఎక్స్‌పోర్ట్‌ విభాగాల కార్యకలాపాలను పరాగ్‌ (Parag Desai) పర్యవేక్షించేవారు. వాఘ్‌ బక్రీ గ్రూప్‌ కంపెనీ ప్రస్తుత టర్నోవర్‌ రూ.2,000 కోట్లు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ కంపెనీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Next Story