ప్రయాణీకులతో వెలుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన మేఘాలయలో చోటు చేసుకుంది. మేఘాలయ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు 21 మంది ప్రయాణీకులతో తురా నుంచి మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు బుధవారం రాత్రి బయలు దేరింది. నోంగ్‌చ్రామ్ వద్ద బస్సు అదుపు తప్పి వంతెన పై నుంచి రింగ్ది నదిలో పడిపోయింది.
బస్సు డ్రైవర్ తో మరో ఐదుగురు ప్రయాణీకులు.. మొత్తం ఆరుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 16 మందిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను బయటకు తీయగా.. మరో రెండు మృతదేహాలు బస్సు లోపల చిక్కుకున్నాయి. నదిలో నీటి ప్రవాహాం తక్కువగా ఉందని అన్నారు. ఒకవేళ నీటి ప్రవాహాం ఎక్కువగా ఉంటే చాలా ఘోరం జరిగేదన్నారు. క్రేన్ సాయంతో బస్సును వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా.. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.