కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. ఏడుగురు మృతి
గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం మధ్యాహ్నం ఆరంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది.
By Srikanth Gundamalla
కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. ఏడుగురు మృతి
గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం మధ్యాహ్నం ఆరంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. మృతదేహాలను వెలికి తీసి ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యల్లో పోలీసులు, ఫైర్ సర్వీస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ (SDRF) పాల్గొన్నారు.
కాగా భవన నిర్మాణం విషయంలో సంచలన విషయాలు తెలిశాయి. 2017-2018లోనే భవనం నిర్మాణం జరిగిందనీ.. ఆరేళ్లకే శిథిలావస్థకు చేరిందని ఓ నివేదిక చెప్పింది. అంతేకాదు.. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ అదికారులు ఈ భవనం యజమానిని ఖాళీ చేయాలని గతంలోనే ఆదేశించినట్లు చెప్పారు. భవనం నిర్మించిన ఆరేళ్లకే కుప్పకూలడం ఆందోళనలు రేకెత్తించాయి. పలువురు దీనిపై విమర్శలు చేశారు. చనిపోయిన వారికి యజమాని బాధ్యత వహించాలంటూ చెబుతున్నారు.
సుమారు ఐదు ఫ్లాట్లలో ప్రజలు నివసిస్తున్నట్లు తెలిసింది. వారిలో ఎక్కువ మంది ఆ ప్రాంతంలోని కర్మాగారాల్లో పనిచేసే వారు అని పోలీస్ కమిషనర్ చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిప్పుడు శిథిలా కింద చిక్కుకున్న పలువురి అరుపులు వినిపించాయని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు.