'నా గేదె మృతికి హెలికాప్టరే కారణం'.. పోలీసులకు వృద్ధుడు ఫిర్యాదు
Buffalo Died due to Loud Sound of Helicopter. దేశంలో ప్రతిరోజూ అనేక విచిత్రమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలు కొన్నిసార్లు మనల్ని
By అంజి Published on 14 Nov 2022 2:30 PM ISTదేశంలో ప్రతిరోజూ అనేక విచిత్రమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలు కొన్నిసార్లు మనల్ని నవ్విస్తాయి. కొన్నిసార్లు మనల్ని ఆలోచించేలా చేస్తాయి. రాజస్థాన్‌లో ఆదివారం ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. బల్బీర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో విచిత్రమైన కేసు పెట్టాడు. హెలికాప్టర్ పెద్ద శబ్ధంతో ఇంటి మీదుగా వెళ్లడం వల్ల తన గేదె చనిపోయిందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా బెహర్ కొహ్రానా గ్రామంలో చోటుచేసుకుంది.
బహ్‌రోడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే బల్జీత్ యాదవ్ వస్తున్నారని కార్యకర్తలు.. ఆయనను స్వాగతించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే తమ ప్రియతమ నాయకుడిపై పూల వర్షం కురిపించేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఆయనపై పూల వర్షం కురిపించారు. అయితే ఆ హెలికాప్టర్ బెహార్ ప్రాంతంలో కొన్ని సార్లు చక్కర్లు కొట్టింది. తక్కువ ఎత్తులో కోహ్రానా గ్రామం మీదుగా వెళ్లింది. దీంతో పెద్ద శబ్దం వచ్చింది. హెలికాప్టర్ చేసిన శబ్దం కారణంగా తన రూ.1.5 లక్షల విలువైన గేదె చనిపోయిందని ఆ గ్రామానికి చెందిన వృద్ధుడు బల్బీర్ ఆరోపించాడు.
అనంతరం హెలికాప్టర్ పైలట్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. గేదెను పరీక్ష నిమిత్తం వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. పరీక్ష నివేదిక అనంతరం గేదె ఎలా చనిపోయిందో తెలుస్తుందని, దాని ఆధారంగా కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు బల్బీర్ గేదెను తిరిగి ఇవ్వాలని లేదా గేదుకు సమానంగా డబ్బు చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.