కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. ఈ ఏడాది కూడా డిజిటల్ బడ్జెట్

Budget 2022 to go paperless for the second time.కేంద్ర‌ప్ర‌భుత్వం పార్ల‌మెంట్‌లో ఫిబ్ర‌వ‌రి 1న 2022-23 బ‌డ్జెట్‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jan 2022 10:39 AM IST
కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. ఈ ఏడాది కూడా డిజిటల్ బడ్జెట్

కేంద్ర‌ప్ర‌భుత్వం పార్ల‌మెంట్‌లో ఫిబ్ర‌వ‌రి 1న 2022-23 బ‌డ్జెట్‌ను ప్ర‌వేశపెట్ట‌నుంది. ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వ‌రుస‌గా నాలుగోసారి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. గ‌తేడాది లాగానే ఈ సారి కూడా కేంద్రం డిజిట‌ల్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ప‌న్నుప్ర‌తిపాద‌న‌లు, ఆర్థిక వివ‌రాలు ఉండే బ‌డ్జెట్ ప్ర‌తుల ముద్ర‌ణ‌ను భారీగా త‌గ్గించిన‌ట్లు అధికారులు తెలిపారు. దీంతో ఎక్కువ శాతం బ‌డ్జెట్ ప‌త్రాలు డిజిట‌ల్ రూపంలోనే ల‌భించ‌నున్నాయి.

కాగా.. గతంలో బడ్జెట్‌ అంటే పార్లమెంట్‌ సభ్యులకు, జర్నలిస్టులకు అందించడానికి వందలాది బడ్జెట్‌ ప్రతులను ముద్రించేవారు. ఇందుకోసం పార్ల‌మెంట్ నార్త్‌బ్లాక్‌లోని ప్రింటింగ్ సిబ్బంది రెండు వారాల పాటు బాహ్యా ప్ర‌పంచంలోకి వ‌చ్చేవారు కాదు. బ‌య‌టి వ్య‌క్తులెవ‌ర్నీ వారు క‌లిసేందుకు కూడా వీలుండేది కాదు. హ‌ల్వా వేడుక నుంచి బ‌డ్జెట్ ప‌త్రాల ముద్ర‌ణ ప్ర‌క్రియ మొద‌ల‌య్యేది. అయితే.. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బడ్జెట్‌ కాపీల ముద్రణను తగ్గించింది.

బడ్జెట్ ప్రక్రియ డిజిటల్‌ రూపంలోకి క్రమంగా మారిపోవడం ప్రారంభమైంది. తొలుత జర్నలిస్టులకు, బయటి విశ్లేషకులకు పంపిణీ చేసే ప్రతులను త‌గ్గించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉండ‌డంతో లోక్‌సభ, రాజ్యసభ పార్లమెంట్ సభ్యులకు అందించే బడ్జెట్ ప్రతుల సంఖ్యలోనూ ప్రభుత్వం కోతపెట్టింది. అంతేకాదు ఈ సారి సంప్ర‌దాయ హ‌ల్వా వేడ‌క‌ను సైతం నిర్వ‌హించ‌లేదు. కాగా.. బ‌డ్జెట్‌ డిజిటల్‌ డాక్యుమెంట్ల రూపకల్పన కోసం కొంతమంది సిబ్బంది మాత్రమే క్వారంటైన్‌లోకి ఉన్నారు.

మరోవైపు బడ్జెట్‌ను చూడాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం యూనియ‌న్ బ‌డ్జెట్ అనే పేరుతో మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఈ యూనియ‌న్ బ‌డ్జెట్ యాప్ ద్వారా బడ్జెట్ పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. ఈ సారి బ‌డ్జెట్ ఎలా ఉండ‌బోతుందోన‌ని సామాన్యులు చాలా ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.


Next Story