జమ్ముకశ్మీర్‌లో మళ్లీ డ్రోన్‌ కలకలం

BSF spots suspicious drone activity in Jammu and Kashmir Arnia Sector.జ‌మ్ముక‌శ్మీర్‌లో డ్రోన్ల సంచారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 July 2021 7:09 AM GMT
జమ్ముకశ్మీర్‌లో మళ్లీ డ్రోన్‌ కలకలం

జ‌మ్ముక‌శ్మీర్‌లో డ్రోన్ల సంచారం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. శుక్ర‌వారం తెల్ల‌వారుజ‌మున అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వ‌ద్ద ఓ డ్రోన్ సంచ‌రించింది. పాక్‌ భూభాగం వైపు ఫెన్సింగుకు అవతల దీన్ని చూసిన బీఎస్ఎఫ్ జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ డ్రోన్ తోక‌ముడిచి తిరిగి పాకిస్థాన్‌ వైపు వెళ్లిపోయింది.

శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 4.25 ప్రాంతంలో జ‌మ్ము శివారులోని అర్నియా సెక్టార్‌లో ఓ చిన్న క్యాడ్‌కాఫ్ట‌ర్ అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దును దాటేందుకు ప్ర‌య‌త్నించింది. ఈ డ్రోన్‌ను గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది వెంట‌నే ఆరుసార్లు కాల్పులు జ‌రిపారు. దీంతో డ్రోన్ పాకిస్థాన్ వైపు వెళ్లిపోయింద‌ని బీఎస్ఎఫ్ అధికార ప్ర‌తినిధి వెల్ల‌డించారు.

ఈ డ్రోన్ తో పరిసర ప్రాంతాల ఫొటోలు తీసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జ‌మ్ముకశ్మీర్‌లో అనుమానిత డ్రోన్లు సంచ‌రించ‌డం ఈ వారంలో ఇది ఐదోసారి కావ‌డం గ‌మ‌నార్హం. జమ్ము ఎయిర్‌పోర్టులోని ఐఏఎఫ్ ఎయిర్ బేస్ వ‌ద్ద డ్రోన్లతో దాడి జ‌రిగిన అనంత‌రం మ‌ళ్లీ ప‌దే ప‌దే డ్రోన్లు సంచ‌రిస్తూ ఆందోళ‌న రేపుతోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే అప్ర‌మ‌త్త‌మైన భార‌త సైన్యం పాక్ డ్రోన్ల ద్వారా దాడుల‌కు పాల్ప‌డ‌కుండా మిలిట‌రీ కేంద్రాల వద్ద యాంటీ డ్రోన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసింది.

Next Story