ఎన్నికల వేళ.. జమ్మూ సరిహద్దులో పాకిస్థాన్ కాల్పులు.. ప్రతీకారం తీర్చుకున్న బీఎస్‌ఎఫ్‌

జమ్మూలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి బుధవారం పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) సిబ్బంది ఒకరు గాయపడ్డారు.

By అంజి  Published on  11 Sept 2024 9:18 AM IST
BSF, soldier injured , Pak violates ceasefire, LoC, Jammu

ఎన్నికల వేళ.. జమ్మూ సరిహద్దులో పాకిస్థాన్ కాల్పులు.. ప్రతీకారం తీర్చుకున్న బీఎస్‌ఎఫ్‌ 

జమ్మూలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి బుధవారం పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) సిబ్బంది ఒకరు గాయపడ్డారని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. నియంత్రణ రేఖకు అవతలి వైపు నుంచి అనూహ్య కాల్పులకు భారత సైనికులు ప్రతీకారం తీర్చుకున్నారు. పాకిస్తానీ రేంజర్లకు తగిన సమాధానం ఇచ్చారు. అయితే పాకిస్తాన్ వైపున ప్రాణనష్టం వెంటనే తెలియరాలేదని వారు తెలిపారు.

"ఉదయం 2.35 గంటలకు, సరిహద్దు అవతల నుండి అఖ్నూర్ ప్రాంతంలో అనూహ్య కాల్పుల సంఘటన జరిగింది, దీనికి బీఎస్‌ఎఫ్‌ తగిన విధంగా స్పందించింది. పాకిస్తాన్ కాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్‌ జవాన్ గాయపడ్డాడు" అని సరిహద్దు రక్షణ దళ ప్రతినిధి తెలిపారు. పాక్ దాడి నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి భారత సైనికులు అప్రమత్తమయ్యారు.

ముఖ్యంగా, రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించిన 2021 నుండి కాల్పుల విరమణ ఉల్లంఘన సంఘటనలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే, గత ఏడాది రామ్‌గఢ్ సెక్టార్‌లో పాక్ జరిపిన కాల్పుల్లో మూడు సంవత్సరాలకు పైగా భారతదేశం వైపు జరిగిన మొదటి ప్రమాదంలో ఒక బీఎస్‌ఎఫ్‌ జవాన్ మరణించాడు.

సెప్టెంబరు 18న జరగనున్న మూడు దశల అసెంబ్లీ ఎన్నికల మొదటి దశకు కొన్ని రోజుల ముందు తాజా కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగింది. రెండో దశ ఎన్నికలు సెప్టెంబర్ 25న జరగనున్నాయి, తర్వాత మూడో దశ అక్టోబర్ 1న జరుగుతాయి.

Next Story