కేంద్రం సంచలన నిర్ణయం, బీఎస్‌ఎఫ్ చీఫ్ తొలగింపు
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సరిహద్దు భద్రతా దళం (BSF) డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్‌ను తొలగించింది.
By Srikanth Gundamalla Published on 3 Aug 2024 4:30 AM GMTకేంద్రం సంచలన నిర్ణయం, బీఎస్‌ఎఫ్ చీఫ్ తొలగింపు
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సరిహద్దు భద్రతా దళం (BSF) డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్‌ను తొలగించింది. ఆయన తో పాటు బీఎస్ఎఫ్ డిప్యూటీ స్పెషల్ డీజీ (పశ్చిమ) వైబీ ఖురానియాను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరు అధికారుల తొలగింపు నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని కేంద్రం పేర్కొంది. వారిని వారి రాష్ట్రాల కేడర్‌కు పంపిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
నితిన్ అగర్వాల్ 1989వ బ్యాచ్ కేరళ కేడర్ అధికారి. గతేడాది జూన్‌లోనే నితిన్ అగర్వాల్ బీఎస్‌ఎఫ్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఖురానియా 1990వ బ్యాచ్ ఒడిశా కేడర్‌కు చెందిన అధికారి. ఈయన ప్రత్యేక డీజీగా(పశ్చిమ) పాకిస్థాన్ సరిహద్దు వెంబడి దళాన్ని పర్యవేక్షిస్తున్నారు. కాగా అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత్‌లోకి నిరంతరం చొరబాట్లు కొనసాగుతున్నాయి. దాంతో.. ఉద్రిక్త పరిస్థితులు, ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. సమన్వయ లోపంతో పాటు పలు ముఖ్యమైన అంశాల విషయంలో నితిన్ అగర్వాల్‌పై ఫిర్యాదులు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బీఎస్ఎఫ్‌పై నియంత్రణ లేకపోవడం, ఇతర ఏజెన్సీలతో సమన్వయం లేకపోవడం వారిని సొంత రాష్ట్రాల కేడర్‌కు పంపించడానికి కారణమని ఓ అధికారి చెప్పారు.
కాగా ఇటీవల సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరిగాయి. ఉగ్రవాద ఘటనలకు సంబంధించి బలగాల చీఫ్‌లను తొలగించడం ఇదే తొలిసారి. 2019లో పుల్వామా ఉగ్రదాడి జరిగినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరినీ బాధ్యులను చేయలేదు. బీఎస్ఎఫ్ లో మొత్తం 2.65 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. పశ్చిమ దిక్కున పాకిస్థాన్, తూర్పు దిక్కున బంగ్లాదేశ్‌తో సరిహద్దులను ఈ బలగాలు కాపలా కాస్తున్నాయి.