కోవిడ్ కేసులతో అల్లాడుతున్న ఇండియాకు సహాయం చేస్తామని ప్రకటించిన బ్రిటన్ తన మాట నిలబెట్టుకుంది. తమ దేశం నుంచి వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లు, ఇతర వైద్య పరికరాలు, మందులను పంపుతామన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇచ్చిన మాటను నిజం చేశారు. మొదటి దశలో భాగంగా 495 ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లు, 120 నాన్-ఇన్వేజివ్ వెంటిలేటర్లు, 20 మాన్యువల్ వెంటిలేటర్లు అతి పెద్ద మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో ఢిల్లీకి చేరుకున్నాయి. ఈ ఆపత్కాల సమయంలో భారత్కు సహాయపడడం తమ విధి అని ఇప్పటికే బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. ఇవే కాక-రానున్న వారాల్లో మరిన్ని మందులు తదితరాలను పంపనున్నారు. ఇండియాలో కోవిడ్ రోగులు పడుతున్న బాధలను గమనించామని, అత్యవసర సాయం చేయడానికి ఎప్పుడూ తాము సిధ్ధమేనని ఆయన చెప్పారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి సైతం తాము భారత అధికారులతో ఎప్పుడూ టచ్ లో ఉంటామని, వారు కోరే సాయం చేస్తామని చెప్పారు.
ఇక కరోనాతో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు సహకారం అందించాలని ప్రజలకు బ్రిటన్స్ ప్రిన్స్ చార్లెస్ పిలుపునిచ్చారు. యావత్తు ప్రపంచం కష్ట సమయంలో ఉన్నప్పుడు భారత్ అండగా నిలిచిందని.. ఇప్పుడు భారత్‌కు సాయం చేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. కరోనా విజృంభణతో గడ్డుకాలం ఎదుర్కొంటున్న భారత్‌కు ఏదైనా సాయం చేయాలని తాను స్థాపించిన బ్రిటీష్ ఏషియన్ ట్రస్ట్ నిర్ణయించిందని చార్లెస్ తెలిపారు. ఆయన స్థాపించిన బ్రిటీష్-ఏషియన్ ట్రస్ట్ భారత్‌లోని ఆసుపత్రుల అత్యవసర పరిస్థితుల అవసరాల్ని తీర్చేందుకు 'ఆక్సిజన్ ఫర్ ఇండియా' పేరుతో లక్ష పౌండ్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.