కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి, ఒకరు మృతి.. శిథిలాల కింద 30 మంది

బీహార్‌లో ప్రమాదం సంభవించింది. సుపాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ భారీ వంతెన ఉన్నట్లుండి కుప్పకూలింది.

By Srikanth Gundamalla  Published on  22 March 2024 11:08 AM IST
bridge, collapse,  bihar, one dead ,

కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి, ఒకరు మృతి.. శిథిలాల కింద 30 మంది

బీహార్‌లో ప్రమాదం సంభవించింది. సుపాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ భారీ వంతెన ఉన్నట్లుండి కుప్పకూలింది. ఈ సంఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరీచా దగ్గర భేజా-బకౌర్‌ మధ్య కోసీ నదిపై భారీ వంతెన నిర్మాణం చేపట్టారు అధికారులు. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో బ్రిడ్జిలోని ఒక భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే.. ఆ సమయంలో కొందరు కార్మికులు బ్రిడ్జిపై ఉన్నారనీ తెలుస్తోంది.

ఉన్నట్లుండి బ్రిడ్జి కూలిపోవడంతో 30కిపైగా మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఒకరు చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. పలువురికి తీవ్రగాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ 9 మందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు సుపాల్‌ డీఎం కౌవల్ కుమార్ తెలిపారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని చూస్తున్నామనీ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం ఎలా సంభవించనే దానిపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కాగా.. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ 2014లో శంకుస్థాపన చేశారు. 2019లోనే పనులు పూర్తవ్వాల్సి ఉండగా ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రూ.1700 కోట్లకు పైగా అంచనా వ్యయంతో బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. కోసి నదిపై భగల్‌పూర్, ఖగారియా జిల్లాలను కలిపేలా ఈ బ్రిడ్జిని అధికారులు నిర్మిస్తున్నారు.


Next Story