బీజేపీ ఎంపీ నివాసం ఎదుట బాంబు పేలుడు

Bombs hurled at Bengal BJP MP Arjun Singh's house.ప‌శ్చిమ‌బెంగాల్‌లోని బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి వ‌ద్ద బాంబు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Sept 2021 11:55 AM IST
బీజేపీ ఎంపీ నివాసం ఎదుట బాంబు పేలుడు

ప‌శ్చిమ‌బెంగాల్‌లోని బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి వ‌ద్ద బాంబు పేలుళ్లు క‌ల‌క‌లం రేపాయి. బుధ‌వారం ఉద‌యం బైక్‌పై వ‌చ్చిన కొంద‌రు దుండ‌గులు ఉత్త‌ర 24 ప‌ర‌ణాల జిల్లాలోని అర్జున్ సింగ్ ఇంటిపైకి మూడు బాంబులు విసిరిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో ఎంపీ ఇంటి గేటు ధ్వంసం అయ్యింది. ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో ఎంపీ ఢిల్లీలో ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే.. ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో ఇంట్లోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎవ్వ‌రికి ఎటువంటి ప్ర‌మాదం జ‌రుగ‌క పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

స‌మాచారం అందుకున్న‌పోలీసులు వెంట‌నే అక్క‌డిక చేరుకున్నారు. సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ దాడి వెనక టీఎంసీకి చెందిన వారున్నారని బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. కాగా.. టీఎంసీ ఈ ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చింది. బీజేపీలోని అంత‌ర్గ‌త ఘ‌ర్ష‌ణ‌ల కారణంగానే ఈ బాంబుదాడి జ‌రిగి ఉండొచ్చున‌ని ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసింది.

మరోవైపు బాంబు పేలుడు ఘటనను బెంగాల్‌ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కఢ్‌ ఖండించారు. బెంగాల్‌లో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ఎంపీ నివాసం బ‌య‌ట చోటుచేసుకున్న బాంబు పేలుళ్లు రాష్ట్రంలోని శాంతి భ‌ద్ర‌త‌ల‌పై ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌న్నారు. దీనిపై పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటార‌ని బావిస్తున్న‌ట్లు తెలిపారు.

Next Story