కేరళ రాష్ట్ర సచివాలయం , అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్‌కు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు నవంబర్ 9, 2023న గురువారం క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లో పేలుడు పదార్థాలను పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు వచ్చినట్లు సమాచారం. వెంటనే స్పందించిన పోలీసు సిబ్బంది, స్నిఫర్ డాగ్స్ సహాయంతో సచివాలయం ఆవరణలో, వెలుపల క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు.
పార్క్ చేసిన వాహనాలు, సమీపంలోని దుకాణాలను కూడా పరిశీలన నుండి మినహాయించలేదు. కాల్ వెనుక ఉన్న నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు ధృవీకరించని నివేదికలు చెబుతున్నాయి. చివరకు పోలీసుల దర్యాప్తులో సచివాలయానికి గురువారం ఉదయం వచ్చిన బాంబు బెదిరింపు బూటకమని తేలింది. కాల్ చేసిన వ్యక్తిని గుర్తించామని, అది ఫేక్ కాల్ అని పోలీసులు తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తి నిధిన్ అని, అతడు తిరువనంతపురం వాసి కాగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. పొజియూరు పోలీసులు అతడిని విచారిస్తున్నారు.