బిగ్‌బి నివాసంతో పాటు మూడు రైల్వే స్టేష‌న్ల‌కు బాంబు బెదిరింపు

Bomb threat call causes scare at 3 railway stations Amitabh Bachchan’s bungalow.ముంబైలోని మూడు ప్రముఖ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2021 4:48 AM GMT
బిగ్‌బి నివాసంతో పాటు మూడు రైల్వే స్టేష‌న్ల‌కు బాంబు బెదిరింపు

ముంబైలోని మూడు ప్రముఖ రైల్వే స్టేషన్లల‌తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదింపులు వ‌చ్చాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ముంబై పోలీసులు బిగ్‌బీ నివాసంతో పాటు రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద భారీగా భ‌ద్ర‌త‌ను పెంచ‌డంతో పాటు విస్తృత త‌నిఖీలు చేప‌ట్టారు. ఇప్పటివరకు నిర్వహించిన సెర్చింగ్ ఆపరేషన్‌లో అనుమానాస్పదంగా ఏ వస్తువు లభ్యం కాలేదని ముంబై పోలీసులు తెలిపారు. దీంతో ఇది న‌కిలీ బెదిరింపు కాల్‌గా తేల‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్‌కు శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఫోన్ చేశాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్‌లతో పాటు జుహులోని నటుడు అమితాబ్ బచ్చన్ బంగ్లా వద్ద బాంబులు పెట్టిన‌ట్లు చెప్పాడు. దీంతో వెంట‌నే అప్ర‌మైన కంట్రోల్ రూమ్ సిబ్బంది రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్‌కు స‌మాచారం ఇచ్చారు. బాంబు స్క్వాడ్‌, జాగిలాల‌ను తీసుకుని రైల్వే స్టేష‌న్ల‌తో పాటు బిగ్‌బీ నివాసం వ‌ద్ద విస్తృత త‌నిఖీలు నిర్వ‌హించారు. త‌నీఖీల్లో ఎటువంటి పేలుడు ప‌దార్థాలు, అనుమానిత వ‌స్తువులు ల‌భించ‌లేదు. అయిన‌ప్ప‌టికి ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఆయా ప్రాంతాల్లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. కాగా.. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు చేశారన్న విషయంపై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story