విషాదం.. హిమపాతంలో గల్లంతైన ఏడుగురు సైనికులు మృతి.. వెల్ల‌డించిన ఆర్మీ

Bodies of 7 army personnel found in Kameng region.అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని క‌మెంగ్ సెక్టార్‌లో ఆక‌స్మిక హిమ‌పాతం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Feb 2022 2:44 AM GMT
విషాదం.. హిమపాతంలో గల్లంతైన ఏడుగురు సైనికులు మృతి.. వెల్ల‌డించిన ఆర్మీ

అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని క‌మెంగ్ సెక్టార్‌లో ఆక‌స్మిక హిమ‌పాతం(మంచు తుఫాన్‌) సంభ‌వించ‌డంతో ఆదివారం(ఫిబ్ర‌వ‌రి 6న‌) ఏడుగురు సైనికులు గ‌ల్లంతైన విష‌యం తెలిసిందే. కాగా.. ఆ ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు భార‌త సైనం మంగ‌ళ‌వారం వెల్ల‌డించారు. వారి మృత‌దేహాల‌ను స్వాధీనం చేస్తున్న‌ట్లు ఆర్మీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 19వ జమ్మూ- క‌శ్మీర్‌ రైఫిల్స్ ద‌ళానికి చెందిన ఏడుగురు సైనికులు క‌మెంగ్ సెక్టార్ ప్రాంతంలో విధులు నిర్వ‌హిస్తున్న క్ర‌మంలో ఆదివారం భారీ మంచు తుఫాన్ సంభ‌వించింద‌ని.. దీంతో సైనికులు అక్క‌డే చిక్కుకుపోయార‌ని చెప్పింది.

కాగా.. ఘటన జరిగిన చుమేగ్యతేర్ ప్రాంతం తవాంగ్ జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి ఈ కమెంగ్ సెక్టార్ 100 కి.మీ దూరంలో ఉంటుంది. స‌మాచారం అందుకున్న వెంట‌నే రెస్క్యూ సిబ్బంది, నిపుణుల బృందం రంగంలోకి దిగాయి. సైనికుల ఆచూకీ కోసం ముమ్మ‌ర స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం వారి మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. స‌ముద్ర మ‌ట్టానికి 14,500 అడుగుల ఎత్తులో మృత‌దేహాలు ల‌భ్య‌మైన‌ట్లు ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌తినిధి లెఫ్టినెంట్ క‌ర్న‌ల్ హ‌ర్షవ‌ర్ష‌న్ పాండే తెలిపారు. మ‌ర‌ణించిన జ‌వాన్ల‌ను జుగల్ కిషోర్, అరుణ్ కట్టాల్, అక్షయ్ పఠానియా, విశాల్ శర్మ, రాకేష్ సింగ్, అంకేష్ భరద్వాజ్, గుర్బాజ్ సింగ్ లుగా గుర్తించారు.

సైనికుల మృతి ప‌ట్ల రాష్ట్రపతి కోవింద్‌ సంతాపం తెలిపారు. ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. జ‌వాన్లు మ‌న భ‌ద్ర‌త కోసం నిస్వార్థంగా కృషి చేస్తున్నారు. వారి సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు.

Next Story