కరోనా నుంచి ఇంకా కోలుకోక ముందే బ్లాక్ ఫంగస్(మ్యుకర్ మైకోసిస్) కలవరపెడుతోంది. ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్న బాధితులను మ్యుకర్ మైకోసిస్ వెంటాడుతోంది. దేశంలో గత మూడు వారాలుగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. 31,216 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడగా 2,109 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో అత్యధికంగా 7,057 కేసులు నమోదు కాగా.. 609 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో 5,418 కేసులు నమోదు కాగా.. 323 మృత్యువాత పడ్డారు. రాజస్థాన్‌లో 2,976 కేసులు నమోదు అయ్యాయి. ఇక కర్ణాటకలో 188 మంది, యూపీలో 142 మంది, ఢిల్లీలో 125 మంది బెంగాల్‌లో 23 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా.. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే అంఫోటెరిసిన్-బీ ఔషధం కొరత తీవ్రంగా ఉండడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదేమీ కొత్త వ్యాధి కాకపోయినప్పటికి దీని బారిన పడినవారికి అతి తక్కువ రోజుల్లోనే పరిస్థితి విషమిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారిలో విషమంగా మారుతోందన్నారు. స్టెరాయిడ్లు ఎక్కువ తీసుకున్న వారికి కూడా బ్లాక్ ఫంగస్ ముప్పు ఎక్కువగా ఉంటోందని డాక్టర్లు అంటున్నారు.