ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీ ఎంపీల వర్క్‌షాప్
ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సిద్ధమవుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండు రోజుల వర్క్‌షాప్‌ను ప్రారంభించింది.
By Knakam Karthik
ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీ ఎంపీల వర్క్‌షాప్
ఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సిద్ధమవుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండు రోజుల వర్క్‌షాప్‌ను ప్రారంభించింది. ఈ వర్క్‌షాప్‌లో పార్టీకి చెందిన అన్ని ఎంపీలు పాల్గొంటున్నారు. మొదటి రోజున ప్రధాని నరేంద్ర మోదీ సాధారణ కార్యకర్తలతో కలిసి చివరి వరుసలో కూర్చోవడం విశేషం. ఈ సందర్భంగా జీఎస్టీ సంస్కరణల కోసం ఎంపీలు ప్రధానికి ఘనంగా అభినందనలు తెలిపారు.
వర్క్‌షాప్ తొలి రోజు 2027 నాటికి అభివృద్ధి చెందిన భారత్ మరియు ఎంపీల చేత సోషల్ మీడియా సమర్థ వినియోగం అనే ప్రధాన అంశాలపై చర్చలు జరిగాయి. ఉదయం దీపారాధన, వందేమాతరం, సాంస్కృతిక కార్యక్రమాలతో వర్క్‌షాప్ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఎంపీలు వ్యవసాయం, రక్షణ, ఇంధనం, విద్య, రైల్వేలు, రవాణా రంగాలపై కమిటీల్లో చర్చించారు. అదనంగా పార్లమెంటరీ ప్రక్రియలు, సబార్డినేట్ లెజిస్లేషన్, హౌస్‌లో సమయ నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ ఇవ్వబడింది.
ఇవాళ రెండో రోజు ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ఎంపీలను సిద్ధం చేయడంపై ప్రధాన దృష్టి సారించనున్నారు. సెప్టెంబర్ 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్, మాజీ లోక్‌సభ సభ్యుడు సీ.పి. రాధాకృష్ణన్ పోటీ చేయనున్నారు. ప్రతిపక్ష ఇండియా బ్లాక్ తరఫున సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరూ దక్షిణ భారత దేశాలకు చెందినవారే. ఎన్నికల్లో సంఖ్యాబలం ఎన్డీఏ పక్షాన ఉన్నప్పటికీ, ప్రతిపక్షం దీన్ని ఆలోచనాత్మక పోరాటంగా అభివర్ణిస్తోంది.
అధికారులతో మర్యాదగా ప్రవర్తించాలి..బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయో, అందరికీ వాటి లాభం చేరుతుందో చూడాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే, అధికారులతో మర్యాదగా ప్రవర్తించాలని ఎంపీలను కోరారు. సంసద్ కార్యశాలలో పాల్గొన్న మోదీ, ఎంపీలు పార్లమెంటరీ కమిటీ సమావేశాల్లో చురుకుగా ఉండాలని సూచించారు. సమావేశాల ముందు, తరువాత సంబంధిత మంత్రులు, అధికారులు కలుసుకోవడం ద్వారా అంశాలపై లోతైన అవగాహన సాధించవచ్చని తెలిపారు.
పరిశుభ్రత కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకెళ్లాలని, సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. కార్యశాలలో చివరి వరుసలో కూర్చొని ఎంపీలతో కలిసి చర్చల్లో పాల్గొన్న మోదీ, ఈ కార్యక్రమంపై తన అనుభవాన్ని Xలో పంచుకున్నారు. “‘సంసద్ కార్యశాల’ వేదిక సహచర ఎంపీలు, నాయకులతో అభిప్రాయాలు పంచుకునే మంచి అవకాశమని” మోదీ ట్వీట్ చేశారు.