రైతు నాయ‌కుల‌ను ఉరి తీయాలి.. అమిత్ షాకు లేఖ రాసిన బీజేపీ ఎమ్మెల్యే

BJP MLA writes to Amit Shah seeks death sentence for farmer leaders involved in tractor rally violence.రైతు నాయ‌కుల‌ను ఉరి తీయాలి.. అమిత్ షాకు లేఖ రాసిన బీజేపీ ఎమ్మెల్యే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jan 2021 5:16 PM IST
BJP MLA writes a letter to Amith shah about farmers leaders

కేంద్ర తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తుండ‌గా..గణతంత్ర దినోత్సవం సంద‌ర్భంగా ఢిల్లీలో నిర్వ‌హించిన‌ ట్రాక్టర్ ర్యాలీలో హింసాకాండ చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు బీజేపీ ఎమ్మెల్యే రాసిన లేఖ సంచనలంగా మారింది. ఈ హింసాకాండకు పాల్పడిన రైతు నాయకులను ఉరి తీయాలని బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్‌ గుర్జర్ డిమాండ్‌ చేశారు. హింసాకాండకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి.. వారిని పోలీసుల‌తో కాల్చి చంపాల‌ని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ హింసాకాండకు పాల్ప‌డిన రైతునాయ‌కుల‌ను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి ఉరి తీయాల‌ని కోరారు.

ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండ‌లో కొంత‌మంది రైతు నాయకులు పాల్గొన్నారని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. రైతు నాయకుల ర్యాలీ సందర్భంగా షరతులను పాటించలేదని, మధ్యాహ్నం 12 నుంచి 5 గంటల మధ్య నిరసనకు అనుమతిస్తే వారు ఉల్లంఘించారని, అందుకే 19 మంది నేతలను అరెస్టు చేసి, మరో 50 మందిని అదుపులోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

కాగా.. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ గత కొన్ని రోజులుగా ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పట్టుబట్ట‌గా.. అందుకు కేంద్రం ససేమిరా అంది. చట్టాల్లో మార్పులు చేసేందుకు సిద్దంగా ఉన్నాము కానీ..చట్టాలను పూర్తిగా రద్దు చేయబోమని కేంద్రం స్పష్టం చేసింది. రైతు సంఘాల నేతలతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇక సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ రైతులతో చర్చలు జరిపింది. చట్టాలను రద్దుపై వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. చట్టాల నిలుపుదలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే చట్టాలు సంవత్సరం పాటు నిలుపుదల చేసిన నేపథ్యంలో ఆ లోపు రైతుల ఆందోళన ఓ కొలిక్కి వచ్చే అవకావం ఉందని కేంద్రం భావిస్తోంది. తాజాగా గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన హింసాకాండ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఎర్రకోటపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.


Next Story