కాబోయే మంత్రులకు కీలక సూచనలు చేసిన మోదీ

ప్రమాణస్వీకారానికి కొద్ది గంటల ముందే కాబోయే మంత్రులతో మోదీ సమావేశం అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  9 Jun 2024 4:10 PM IST
bjp,  modi,  new ministers,

కాబోయే మంత్రులకు కీలక సూచనలు చేసిన మోదీ  

ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాత్రి 7.15 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఆయనతో పాటు 57 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. అయితే.. చివరి క్షణంలో ఒకరిద్దరు పేర్లను మార్చే అవకాశం ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు కేంద్ర మంత్రుల లిస్ట్‌లో ఉన్నవారి లిస్ట్‌ చూసినట్లు అయితే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. వీరిలో టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ముగ్గురు ఉన్నారు. ఏపీ నుంచి బీజేపీ నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మ పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది.

ప్రమాణస్వీకారానికి కొద్ది గంటల ముందే కాబోయే మంత్రులతో మోదీ సమావేశం అయ్యారు. ఈ క్రమంలోనే వారికి తేనేటి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేశ అభివృద్ధి కోసం ఈ భేటీలో నేతలకు మోదీ కీలక సూచనలు చేశారు.

కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. బాధ్యతలపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. దేశ అభివృద్ధి కోసం నిత్యం కృషి చేయాలన్నారు. చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేలా పనిచేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానిగా మోదీ సాయంత్రం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధానితో పాటుగా మరికొందరు మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. ఈసారి కేబినెట్‌లో ఇద్దరు మాజీ సీఎంలకు చోటు దక్కింది. వీరిలో హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్‌ ఖట్టర్‌, మధ్యప్రదేశ్ మాజీసీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్ ఉన్నారు.

Next Story