నిన్న దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ నాయకులు, ఇతర రంగాలకు చెందిన వాళ్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నేత, నటి కుష్భూ ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. అయితే.. తను చేసిన పోస్టులో మన జెండా బదులు వేరే దేశపు జెండా ఉండడంతో.. దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నైగర్ దేశపు జెండా కూడా.. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నప్పటికీ మధ్యలో చిహ్నం మాత్రం తేడా ఉంటుంది. భారతదేశ పతాకం మధ్యలో 24 ఆకులతో నేవీ బ్లూ రంగులో అశోక చక్రం ఉంటుంది. నైగర్ జెండాలో కాషాయం రంగులో వృత్తాకారం ఉంటుంది. రెండూ జెండాలు ఒకే పోలికతో ఉండడంతో కుష్బూ తన ట్వీట్‌లో పొరపాటున నైగర్ జెండాలను పెట్టారు. దీంతో కుష్భూకు క్లాస్ పీకుతున్నారు. 'నయా భారత్‌లో భారత పతకం కూడా మారిపోయిందా..' అని ఓ నెటిజన్ ప్రశించగా.. ''మీరు పార్టీ మారారని తెలుసు.. కానీ ఇప్పుడు ఏకంగా దేశం కూడా మారారా?'' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
దీనిపై కుష్భూ స్పందించారు. తన పొరపాటును అంగీకరిస్తూ క్షమాపణ కోరారు. 'ట్వీట్ చేసేటప్పుడు కళ్లద్దాలు పెట్టుకోలేదు. ఇది ఆమోదయోగ్యం కానప్పటికీ.. మనస్పూర్తిగా క్షమాపణ చెబుతున్నాను.. నా దేశం.. నా ఇండియా..' అని కుష్బూ మరో ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి తన ప్రొపైల్ పిక్‌లో జాతీయ జెండాను పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.