జేపీ నడ్డా భార్య కారుని ఎత్తుకెళ్లిన దొంగలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణికి చెందిన కారును కొందరు దుండగులు అపహరించారు.
By Srikanth Gundamalla Published on 25 March 2024 11:10 AM ISTజేపీ నడ్డా భార్య కారుని ఎత్తుకెళ్లిన దొంగలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణికి చెందిన కారును కొందరు దుండగులు అపహరించారు. ఈ సంఘటన ఢిల్లీలోని గోవింద్‌పురిలో చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీజేపీ ఛీప్ జేపీ నడ్డా సతీమణి మల్లికా నడ్డా ఫార్చునర్ కారును వాడుతున్నారు. అయితే ఆ కారు సర్వీసింగ్‌కి ఇచ్చే సమయం కావడంతో దాన్ని షెడ్‌కు తీసుకెళ్లారు. స్వయంగా టయోటా ఫార్చునర్ కారుని డ్రైవర్ జోగిందర్ సర్వీసింగ్ చేయించాడు. ఇక ఆ తర్వాత తిరిగి గోవింద్‌పురికి తీసుకువెళ్లాడు. అక్కడే డ్రైవర్ జోగిందర్ నివాసం ఉంటున్నాడు. ఇంట్లోకి వెళ్లి భోజనం చేశాడు. తిరిగి వచ్చి చూసే సరికి అక్కడ కారు కనిపించలేదు. కారును ఎవరో అపహరించారని నిర్ధారించుకున్న డ్రైవర్ జోగిందర్ వెంటనే జేపీ నడ్డా సతీమణి మల్లికాకు తెలియజేశాడు. మార్చి 19న మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య ఈ చోరీ జరిగిందని తెలిపాడు డ్రైవర్ జోగిందర్.
ఇక దీని గురించి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. దాంతో.. కేసు నమోదు చేసుకుని పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు. దొంగలు కారును చోరీ చేసి... గురుగ్రామ్ వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. అయితే.. చోరీకి గురైన కారు గురుగ్రామ్ వైపు వెళ్తున్నట్లు గుర్తించారు కానీ.. ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారనేది తెలియరాలేదు. పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కారు ఆచూకీ తెలియలేదు. ఇక దొంగిలించబడిన కారు హిమాచల్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిఉందని పోలీసులు చెప్పారు.