కుటుంబ రాజకీయాలకు మోదీ ఫుల్‌స్టాప్ పెట్టారు: అమిత్‌షా

కాంగ్రెస్, ఇండియా కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  18 Feb 2024 1:30 PM IST
bjp, amit shah, comments,  india alliance ,

కుటుంబ రాజకీయాలకు మోదీ ఫుల్‌స్టాప్ పెట్టారు: అమిత్‌షా

కాంగ్రెస్, ఇండియా కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతోన్న బీజేపీ జాతీయ మండలి కౌన్సిల్‌ సమావేశాల్లో పాల్గొన్న అమిత్‌షా మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబ రాజకీయాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారని చెప్పారు. దేశంలో రాజకీయం కౌరవులు, పాండవుల్లా రెండు పక్షాలుగా విడిపోయిందని అన్నారు. ఎన్డీఏది పాండవుల కూటమిగా పేర్కొన్నారు. ఇక ఇండియా కూటమిని కౌరవుల కూటమిగా పోల్చారు. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయనీ.. కౌరవుల కూటమని పాండవుల కూటమి చిత్తు చేయనుందని అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిలో ఏడు కుటుంబ పార్టీలు ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

పార్లమెంట్‌ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. బీజేపీ రెండ్రోజుల పాటు దేశరాజధాని జాతీయ మండలి కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తోంది. 400 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను రచిస్తోంది. ఇతర పార్టీల నుంచి చేరికలు, ప్రచారంపై ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ప్రధాని అభ్యర్తి ఎంపికతో పాటు, పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకం వంటి అంశాలపై సమావేశాల్లో చర్చిస్తున్నట్లు సమాచారం. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇక మరోవైపు ఇండియా కూటమి ఎలాగైనా మోదీ సర్కార్‌ను గద్దె దించి తాము అధికారంలోకి రావాలని చూస్తోన్న విషయం తెలిసిందే.

Next Story