జార్ఖండ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. బొకారో జిల్లాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పౌల్ట్రీ ఫాంలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బర్డ్ ఫ్లూని కట్టడి చేసేందుకు సుమారు 4 వేల కోళ్లు, బాతులను చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రక్రియ శనివారం అర్థరాత్రి ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 2 నుంచి ఫౌల్ట్రీ ఫామ్‌లో వరుసగా కోళ్లు చనిపోతుండడంతో పరీక్షలు నిర్వహించగా అందుకు కారణం బర్డ్ ఫ్లూ అని పిలుచుకునే ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్ రకానికి చెందిన హెచ్5ఎన్1 (H5N1)గా గుర్తించారు. మామూలు కోళ్లలోనే కాదు ప్రోటీన్లు అధికంగా ఉండే కడక్‌నాథ్ కోళ్లలోనూ హెచ్5ఎన్1 వైరస్‌ను గుర్తించారు. ఫామ్‌లో ఉన్న 800 పైగా కడక్ నాథ్ కోళ్లు చనిపోయాయని, మరో 103 కోళ్లను చంపాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు.
దీంతో లోహంచల్ ఫామ్‌కు ఒక కిలోమీటర్ రేడియస్‌లో ఉన్న కోళ్లు, బాతులు సహా మొత్తం 3,856 పక్షులను చంపుతున్నట్లు పశు ఆరోగ్య, ఉత్పత్తి డైరెక్టర్ బిపిన్ బిహారీ మహ్తా తెలిపారు. ఈ ఫామ్‌కు 10 కిలోమీటర్ల రేడియస్‌లో ఉన్న కోళ్ల ఫామ్‌పై ప్రత్యేక నిఘా పెట్టాము. అలాగే బొకారా జిల్లాలో చికెన్ విక్రయాలపై నిషేదం విధించినట్లు తెలిపారు.