కేరళ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. అలప్పుజాలోని రెండు పంచాయతీలలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్లు నిర్ధారించబడిన తర్వాత, ఆరోగ్య మంత్రి వీణా జార్జ్, ఏప్రిల్ 20, శనివారం, కేరళ ప్రజారోగ్య చట్టం, 2023 ప్రకారం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు. పెంచిన బాతులలో ఫ్లూ కనుగొనబడింది. ఎడత్వ, చేరుతనా పంచాయతీల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది. ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇది ముందుజాగ్రత్త చర్య అని, హెచ్5ఎన్1 వైరస్ మనుషులకు సోకే ముప్పు లేదని భరోసా ఇచ్చారు.
కేరళ ప్రజారోగ్య చట్టం కింద అన్ని పంచాయతీ స్థాయి కమిటీలు, మున్సిపాలిటీలు సమావేశమై పరిస్థితిని పర్యవేక్షించాలని, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. నిఘాలో ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు జ్వరం, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తితే ఆసుపత్రులకు తెలియజేయాలన్నారు.
ఇందుకోసం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక ఔట్ పేషెంట్ వార్డును వైద్యఆరోగ్యశాఖ ఏర్పాటు చేసింది. ఇంకా మనుషుల్లో బర్డ్ ఫ్లూ జ్వరం కేసులు ఉన్నట్లయితే అలప్పుజ జనరల్ హాస్పిటల్‌ను ఐసోలేషన్ సెంటర్‌గా ఏర్పాటు చేస్తారు.. అంతేకాకుండా బర్డ్ ఫ్లూ గుర్తించిన ప్రాంతాలకు 3 కిలోమీటర్ల పరిధిలో ఫీవర్ సర్వే నిర్వహిస్తారు.