కడుపులో కత్తి, నెయిల్ కట్టర్, తాళం చెవులు..షాకైన డాక్టర్లు
బీహార్‌లో ఓ యువకుడు కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చాడు.
By Srikanth Gundamalla Published on 27 Aug 2024 7:08 AM ISTకడుపులో కత్తి, నెయిల్ కట్టర్, తాళం చెవులు..షాకైన డాక్టర్లు
అనుకోకుకుండా చిన్నపిల్లలు కాయిన్స్ లేదంటే ఇతరాత్ర వస్తువులను మింగుతుంటారు. ఇంకొన్నిసార్లు వైద్యులు ఆపరేషన్లు చేసినప్పుడు కడుపులోనే కత్తెర సహా ఇతర వస్తువులను మర్చిపోయిన కుట్లు వేసిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా బీహార్‌లో ఓ యువకుడు కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. అతడి కడుపునొప్పి ఎందుకో తెలుసుకోవడానికి స్కాన్ చేసిన వైద్యులకు షాక్ ఎదురైంది.ఏకంగా ఆ యువకుడి కడుపులో కత్తితో పాటు, నెయిల్ కట్టర్, తాళం చెవులను గుర్తించారు. ఈ ఘటన బిహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో జరిగింది.
మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్న బీహార్‌కు చెందిన యువకుడు కొద్దిరోజుల క్రితం ఆస్పత్రికి వెళ్లాడు. 22 ఏళ్ల యువకుడు తీవ్రమైన కడుపు నొప్పితో మోతిహరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ఎక్స్‌రే తీసిన వైద్యులు అతని కడుపులో పలు లోహ వస్తువులున్నట్లు గుర్తించారు. దీంతో ఆదివారం సర్జరీ చేసి వాటిని తొలగించినట్లు వైద్యులు చెప్పారు. ఎక్స్‌రే రిపోర్టు ద్వారా అతని కడుపులో వస్తువులున్నట్లు తెలిసిందని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. కడుపులో ముందుగా ఒక కీచెయిన్ రింగ్‌ను తీసేశామనీ... తర్వాత రెండు తాళంచెవులు బయటపడ్డాయని పేర్కొన్నారు. ఆ తర్వాత నాలుగు అంగుళాల పొడవున్న కత్తి, రెండు నెయిల్ కట్టర్లు వెలికితీశామని ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు వెల్లడించారు. అయితే.. యువకుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పారు. అందుకే ఇలా లోహ వస్తువులను మింగేసి ఉంటాడని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన చికిత్సను తీసుకుంటున్నాడని వెల్లడించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు వైద్యులు.