పదో తరగతి బోర్డు పరీక్షలు రాసేందుకు వెలుతున్నానని చెప్పి ఓ యువతి ఇంటి నుంచి బయటికి వెళ్లింది. పరీక్షలకు హాజరుకాకుండా తన ప్రియుడిని పెళ్లిచేసుకుంది. పోలీసుల సమక్షంలో వీరి పెళ్లి జరగడం విశేషం. పరీక్షలు రాయలేనందుకు బాధగా లేదని.. పరీక్షల్లో ఫెయిల్ అయిన ప్రేమలో పాసైనందుకు ఆనందంగా ఉందని ఆ యువతి చెప్పింది. వచ్చే సంవత్సరం పరీక్షలు రాస్తానంది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాలో జరిగింది.
మణిహరి ప్రాంతంలో గౌరి అనే యువతి తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు 2016లో మొబైల్ ఫోన్‌కు ఓ మిస్డ్ కాల్ వచ్చింది. అలా నితీశ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. నాలుగేళ్లుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో వారిద్దరు పోలీసుల సహాయం కోరారు. వారు మేజర్లు కావడంతో పోలీసులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో శనివారం పరీక్ష రాసేందుకు వెలుతున్నానని గౌరీ ఇంట్లో చెప్పి వెళ్లింది. పరీక్ష కేంద్రం సమీపంలో తన కోసం ఎదురుచూస్తున్న నితీశ్‌తో కలిసి గుడికి వెళ్లింది. గుడిలో వీరిద్దరు పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
అనంతరం ఇరు కుటుంబాలను పిలిచి పోలీసులు వారికి నచ్చజెప్పారు. దీంతో గౌరి తాను పెండ్లాడిన ప్రియుడు నితీశ్‌ను తీసుకుని తన ఇంటికి వెళ్లింది. అయితే పరీక్ష రాయలేనందుకు గౌరికి ఏ మాత్రం బాధ లేదు. తాను ప్రేమలో పాస్ అయ్యానని, వచ్చే ఏడాది పరీక్షను రాస్తానని ఆమె చెప్పింది.