నకిలీ వైద్యుడి నిర్వాకం.. యూట్యూబ్‌లో చూసి ఆపరేషన్, బాలుడు మృతి
బీహార్‌లో నకిలీ వైద్యుడి నిర్వాకంతో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
By Srikanth Gundamalla Published on 8 Sep 2024 8:00 AM GMTబీహార్‌లో నకిలీ వైద్యుడి నిర్వాకంతో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వాంతులు చేసుకోవడంతో ఆస్పత్రికి ఓ బాలుడిని తీసుకెళ్లారు తల్లిదండ్రులు. చికిత్స తర్వాత బాలుడికి వాంతులు ఆగిపోయాయి. అయితే.. ఆపరేషన్ చేయాలంటూ నకిలీ వైద్యుడు చెప్పాడు. తల్లిదండ్రులు వద్దని చెప్పినా వినకుండా.. యూట్యూబ్‌లో చూస్తూ ఆపరేషన్ చేసేందుకు ప్రయత్నించాడు. చివరకు బాలుడి పరిస్థితి విషమించడంతో అక్కడికి నుంచి పెద్దాసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దారి మధ్యలోనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
బీహార్‌లోని సారణ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన 15 ఏళ్ల బాలుడు కృష్ణకుమార్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. పదే పదే వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు అతన్ని గణపతి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చేర్పించిన కాసేపటికే వాంతులు ఆగిపోయాయి. ఇక తల్లిదండ్రులు తమ కుమారున్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న డాక్టర్ అజిత్ కుమార్ పురి.. ఆపరేషన్ చేయాలని చెప్పాడు. తల్లిదండ్రులు వద్దని చెప్పినా వినలేదు. యూట్యూబ్‌లో చేస్తూ ఆపరేషన్ చేయడానికి ప్రయత్నించాడని బాలుడి తల్లిదండ్రులు వెల్లడించారు. కాసేపటికే కృష్ణకుమార్ పరిస్థితి విషమంగా మారడంతో.. పాట్నాలోని పెద్దాసుపత్రికి తరలిచేందుకు చూశారు. కానీ కొంత దూరం వెళ్లగానే బాలుడు చనిపోయాడు.
దాంతో.. తిరిగి ఆసుపత్రి వద్దకు తీసుకొచ్చి మృతదేహాన్ని మెట్లపై వదిలేసి డాక్టర్ అజిత్ కుమార్ పురి పారిపోయాడన్నారు బాలుడి తల్లిదండ్రులు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగేంత వరకూ మృతదేహానికి అంత్యక్రియలు చేయబోమని తేల్చిచెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు డాక్టర్ అజిత్ కుమార్ పురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో.. చివరకు ఆందోళన విరమించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.