తొమ్మిదేళ్లుగా నిర్మాణం.. గంగా నదిపై మూడోసారి కూలిన బ్రిడ్జి

గత కొంత కాలంగా బీహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలిపోతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  17 Aug 2024 2:00 PM IST
bihar, bridge collapse, under construction,   9 years,

తొమ్మిదేళ్లుగా నిర్మాణం.. గంగా నదిపై మూడోసారి కూలిన బ్రిడ్జి

గత కొంత కాలంగా బీహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. కొన్ని నెలల కాలంలోనే పదుల సంఖ్యలు ఈ సంఘటనలు జరిగాయి. అయితే.. తాజాగా బీహార్‌లో మరో బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ బ్రిడ్జి నిర్మాణం తొమ్మిదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. నిర్మాణ దశలోనే ముచ్చటగా మూడు సార్లు కూలిపోయింది. కాగా.. దీని నిర్మాణం కోసం రూ1717 కోట్ల ను ప్రభుత్వం ఖర్చు చేసింది. నిర్మాణ దశలోనే ఇన్నిసార్లు కూలితే ఎలా అంటున్నారు స్థానిక జనం. మరోవైపు ఒక వేళ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రమాదకరంగా మారదని ఏంటి గ్యారెంటీ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

బీహార్‌లోని ఖగారియా జిల్లాలో గంగా నదిపై అగువాని సుల్తాన్‌గంజ్‌ గంగా పేరుతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్‌లో ఓ భాగం ఒక్కసారిగా గంగానదిలో కూలిపోయింది. బ్రిడ్జి కూలిపోతున్న దృశ్యాలను అక్కడే ఉన్న స్థానికులు రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వంతెనకు ప్రమాదం జరగడం ఇది మూడోసారి. గతేడాది ఏప్రిల్‌లో తుఫాను కారణంగా వంతెన పిల్లర్లు కొంతభాగం కుప్పకూలి పోగా తిరిగి నిర్మాణం చేపట్టారు.

దీని నిర్మాణం కోసం బిహార్‌ ప్రభుత్వం రూ.1,717 కోట్లు కేటాయించింది. 2015లో నీతీశ్‌కుమార్‌ ఖగారియా - అగువాని ప్రాంతాల మధ్య గంగా నదిపై ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2020 నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా అది ఇంకా జరగలేదు. ఒకే వంతెన నిర్మాణం పూర్తికాకముందే మూడుసార్లు కూలడంతో నిర్మాణంలో నాణ్యత, ప్రాజెక్టు అమరికపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమర్శల నేపథ్యంలో దీనిపై స్పందించిన ప్రభుత్వం.. నిర్మాణం చేపడుతున్న ఎస్‌ కే సింగ్లా కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు జరిమానా విధించింది. వంతెనను సొంత ఖర్చుతో పునర్నిర్మించాలని ఆదేశించింది.



Next Story