సోమవారం మధ్యాహ్నం భోపాల్‌లోని ఒక ఆభరణాల దుకాణంలో ముసుగు ధరించిన వ్యక్తి దోపిడీకి ప్రయత్నించాడు. అయితే దుకాణ యజమాని, సిబ్బంది అతన్ని ధైర్యంగా పట్టుకుని.. అతన్ని అడ్డుకున్నారు. శివం జైస్వాల్ గా గుర్తించబడిన అనుమానితుడు అక్షంష్ జ్యువెలర్స్ దుకాణంలోకి ప్రవేశించి బంగారు గొలుసు చూపించమని అడిగాడు. దుకాణ యజమాని మనోజ్ జైన్ అతని ముసుగు తొలగించమని కోరినప్పుడు, జైస్వాల్ పిస్టల్ చూపిస్తూ నగలు డిమాండ్ చేశాడు.
ఈ క్రమంలోనే మనోజ్ జైన్ ప్రతిఘటించినప్పుడు, దొంగ గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆపై పిస్టల్ బట్‌తో అతని ముఖంపై కొట్టాడు. గాయపడినప్పటికీ, మనోజ్ జైన్ తన ఉద్యోగులతో కలిసి జైస్వాల్‌ను లొంగదీసుకోగలిగాడు. ఆ గొడవను చూసి, సమీపంలోని దుకాణదారులు అక్కడ గుమిగూడారు. చివరకు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి రప్పించిన తర్వాత నిందితుడిని వారికి అప్పగించారు.