'యూనివర్సల్ వ్యాక్సిన్'గా కొవాగ్జిన్
Bharat Biotech says Covaxin now universal vaccine for adults, children.ప్రపంచదేశాలన్నింటినీ కరోనా
By తోట వంశీ కుమార్ Published on 14 Jan 2022 11:02 AM IST
ప్రపంచదేశాలన్నింటినీ కరోనా మహమ్మారి భయం వెంటాడుతోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్ మాత్రమే. అందుకనే అన్ని దేశాలు వ్యాక్సిన్ల ఉత్పత్తి, వ్యాక్సినేషన్ పై ప్రధానంగా దృష్టిసారించాయి. ఇక మనదేశంలో అనుమతి పొందిన వ్యాక్సిన్లలో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ 'కొవాగ్జిన్' ఒకటి. తాజాగా కొవాగ్జిన్ మరో ఘనతను సాధించింది. చిన్నారులు, వయోజనులకు పంపిణీ చేస్తున్న కొవాగ్జిన్ టీకా 'యూనివర్సల్ వ్యాక్సిన్' గా గుర్తింపు పొందింది.
ఈ విషయాన్ని భారత్ బయోటెక్ ఓ ప్రకనలో తెలిపింది. దీంతో కరోనాకు యూనివర్సల్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాలన్న తమ లక్ష్యం నెరవేరినట్లు వెల్లడించింది. కొవిడ్ 19 వేరియంటు అయిన డెల్టా, ఒమిక్రాన్ల పైనా కొవాగ్జిన్ సమర్థంగా పని చేయగలదని పేర్కొంది. ఇంతకు ముందు జరిగిన అధ్యాయనాలు కరోనా ఆల్ఫా, బీటా, డెల్టా, జిటా, కప్ప వేరియంట్లను కొవాగ్జిన్ నిర్వీర్యం చేయగలదని నిర్ధారించినట్లు గుర్తు చేసింది. వ్యాక్సిన్ అభివృద్ది, లైసెన్సులకు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తి అయినట్లు తెలిపింది.
ఇక మనదేశంలో గతేడాది జవనరిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటి వరకు 155.39 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. జనవరి 3 నుంచి 15 నుంచి 18 సంవత్సరాల వారికి కూడా వ్యాక్సిన్ ను ఇస్తున్నారు. వీరికి కొవాగ్జిన్ టీకానే ఇస్తున్న విషయం తెలిసిందే.