కరోనా మహమ్మారి అంతానికి దేశ వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనాకు టీకా వచ్చిందని కొందరు ఆనందపడుతున్నా.. ఈ టీకా తీసుకోవడం వల్ల ఏమవుతుందోనని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తొలి దేశీయ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు సంబంధించి భారత్ బయోటెక్ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటీవల కోవాగ్జిన్ టీకా దుష్ప్రభావాలపై పలు విమర్శలు వచ్చిన క్రమంలో.. భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ తన వెబ్ సైట్‌లో ఫ్యాక్ట్ షీట్‌ను రిలీజ్ చేసింది.
ఎవరు తీసుకోవచ్చు.. ఎవరు తీసుకోరాదు..
తాజాగా రిలీజ్ చేసిన మార్గదర్శకాల్లో.. ఎవరు టీకా తీసుకోవాలి, ఎవరు తీసుకోవద్దు అన్న అంశాలపై క్లారిటీ ఇచ్చింది. బలహీనమైన ఇమ్యూనిటీ ఉన్న వారు, రోగనిరోధక శక్తి వ్యవస్థపై ప్రభావం చూపే మందులు వాడేవారు, అలర్జీ సమస్యలు ఉన్నవారు .. కోవాగ్జిన్ టీకాను తీసుకోరాదు అని ఫ్యాక్ట్ షీట్‌లో హెచ్చరించింది. అలర్జీ, జ్వరం, బ్లీడింగ్ డిజార్డ్‌లు ఉన్నవారు.. డాక్టర్లు అనుమతి తీసుకున్న తర్వాతే టీకా వేసుకోవాలని తన సూచనల్లో పేర్కొన్నది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు కూడా కోవాగ్జిన్ తీసుకోకూడదని తెలిపింది. మరో కంపెనీ టీకా తీసుకున్న వారు.. తమ టీకా వాడవద్దు అని భారత్ బయోటెక్ తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
సైడ్ ఎఫెక్ట్స్ ..
కోవాగ్జిన్ టీకా వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తన ఫ్యాక్ట్ షీట్ లిస్టులో కొన్ని అంశాలు వెల్లడించింది. టీకా తీసుకున్న ప్రాంతంలో నొప్పి, వాపు, దురద వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జ్వరం, బలహీనత, దద్దులు, నలత, వాంతులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కోవాగ్జిన్ వల్ల అలర్జీ రియాక్షన్ ఏర్పడే ప్రమాదం ఉన్న దృష్ట్యా.. టీకా తీసుకున్న తర్వాత ఓ అరగంట పాటు వ్యాక్సిన్ సెంటర్‌లోనే ఉండాలని సూచించింది. రెండవ డోసు టీకా తీసుకున్న తర్వాత.. మూడు నెలల పాటు ఫాలోప్ ఉంటుందని తెలిపింది.