ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది రాజకీయ నాయకులకు అధికారాన్ని అందించిన వ్యక్తి. తన వ్యూహాలతో నాయకుల వెనకుండి నడిపించే వారు. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే విజయాలు దాదాపు ఖాయమయ్యాయి. ఆ రెండు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ వ్యవహరించారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎంతగా బెంగాల్ లో ఆధిపత్యం చెలాయించాలని చూసినా కూడా ప్రశాంత్ కిషోర్ తన టీమ్ తో అడ్డుకున్నారు.
ఇక ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్ కూడా సాధించదని పలుమార్లు సవాల్ చేసిన పీకే తాజా ఎన్నికల ఫలితాల సరళి నేథ్యంలో వ్యూహకర్త పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక తాను చేస్తున్న దాన్ని కొనసాగించలేనని జాతీయ మీడియాతో చెప్పుకొచ్చారు. చేయగిలినంత చేశాను. బెంగాల్ గెలిచింది. ప్రస్తుతం కొంతకాలం బ్రేక్ తీసుకొని జీవితంలో ఇంకేమైనా చేయాలని భావిస్తున్నా అన్నారు. అయితే మళ్లీ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారా అని ప్రశ్నించినపుడు.. రాజకీయాల్లో తాను విఫలమయ్యానని అన్నారు. ఇకపై తాను ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగబోవడంలేదని స్పష్టం చేశారు. జీవితంలో మరేదైనా చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.
బెంగాల్ గెలిచిందని, అందుకు తాను ఎంత చేయాలో అంతా చేశానని అన్నారు. కొంతకాలం విరామం తీసుకోవాలనుకుంటున్నానని.. గతంలో తాను కూడా రాజకీయాల్లోకి వచ్చినా, విఫలం అయ్యానని వెల్లడించారు. బెంగాల్ లో 8 విడతల్లో ఎన్నికలు జరగ్గా బీజేపీకి రెండంకెల సీట్లు దాటితే తాను ట్విట్టర్ నుంచి తప్పుకుంటానని ప్రశాంత్ కిశోర్ గతంలో సవాల్ చేశారు. ఆయన సవాల్ కు తగ్గట్టుగానే బీజేపీకి ప్రస్తుతం బెంగాల్ ఓట్ల లెక్కింపులో రెండంకెలకు మించి సీట్లు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు.