బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. ఢీకొన్న రెండు రైళ్లు

బెంగాల్‌లో మరో రైలు ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  17 Jun 2024 10:32 AM IST
Bengal, train accident, cm mamata banerjee, tweet,

 బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. ఢీకొన్న రెండు రైళ్లు 

కొంతకాలంగా ఇండియన్ రైల్వేస్‌లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దాంతో.. ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. భారతీయ రైల్వేకు దేశంలో మంచి ఆదరణ ఉంటుంది. నిత్యం లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి రైల్వేలో చిన్నచిన్న తప్పులు, నిర్లక్ష్యం కారణంగా ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా బెంగాల్‌లో మరో రైలు ప్రమాదం సంభవించింది.

బెంగాల్‌లోని సిలిగురిలో రైలు ప్రమాదం సంభవించింది. కోల్‌కతాలోని సీల్దా స్టేషన్‌కు బయల్దేరిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ న్యూజల్‌పాయ్‌గుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికే వెనక నుంచి ఓ గూడ్స్‌ రైలు దీన్ని బలంగా ఢీకొట్టింది. సీల్దా స్టేషన్‌కు వెళ్తుండగా రంగపాణి ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలు బోగీలు పట్టాలు తప్పి.. పక్కకు పడిపోయాయి. మరో బోగి మాత్రం ముందున్న బోగీ పైకి ఎక్కి.. గాల్లో కనబడుతోంది. ఘటనాస్థలిలో ప్రమాద దృశ్యాలు చూస్తూ భయానకంగా ఉన్నాయి. దాంతో.. పలువురు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు అధికారులు. కానీ.. ఇప్పటి వరకు ఎవరూ చనిపోయినట్లు వివరాలు తెలియలేదు. దాదాపు వంద మందికిపైగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడకి వెళ్లారు. గాయపడ్డవారికి సాయం అందిస్తున్నారు. ప్రమాదం ఎలా చోటుచేసుకుంది..? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ రైలు ప్రమాదంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా మెజిస్ట్రేట్, వైద్యులు, అంబులెన్స్‌లు ఘటనాస్థలానికి వెళ్లాయని చెప్పారు. ఈ రైలు ప్రమాదం గురించి తెలుసుకోగానే దిగ్భ్రాంతికి గురైనట్లు ఆమె పేర్కొన్నారు. మరోవైపు రెస్క్యూ, రికవరీ, వైద్య సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు.

Next Story